వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం .. సోషల్ మీడియా ఇంచార్జ్ ఓ సమావేశం పెట్టారు. జగన్ విశాఖలో ఉన్నారు కాబట్టి అందర్నీ అక్కడికే రమ్మన్నారు. అతి కష్టం మీద రెండు వందల మంది వచ్చారు. మిగతా వారిని వైజాగ్ నుంచే సమీకరించారు. మొత్తం ఐదు వందల మంది వచ్చారు. కానీ ఒక్కరంటే ఒక్కరూ జగన్ చెప్పిన మాటల్ని వినలేదు.. వారు చెప్పిన మాటల్ని జగన్ వినలేదు.
వైజాగ్ లో రీల్స్ చేసుకునే ఓ అమ్మాయి జగన్ సంపాదనపై అబ్బురపడి.. అసలు ఆయన వ్యాపారాల కిటుకులేంటో తెలుసుకుందామని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయిందేమో కానీ ఆయన పట్టించుకోలేదు. కానీ సజ్జల భార్గవ మాత్రం జగన్ రెడ్డి కంటే తానే తెలివైనవాడినని చెప్పుకునేందుకు తాపత్రయ పడ్డారు. ఆయన చెప్పిన సమాధానమేమిటంటే.. గూగుల్ లో చూసుకోమని. జగన్ గురించి గూగుల్ లో సెర్చ్ కొడితే ఏమని వస్తుందో అందరికీ తెలుసు. అయినా కుమార సజ్జల అదే సలహా ఇచ్చి ఆ సోషల్ మీడియా సపోర్టర్ కు గొప్పగా సమాధానం ఇచ్చానని అనుకున్నారు.
గత ఎన్నికల సమయంలో వైసీపీ కోసం స్వచ్చందంగా పని చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన తప్పును తెలుసుకున్నారు. వారిలో 90 శాతం మంది సైలెంట్ అయిపోయారు..లేకపోతే పార్టీ మారిపోయారు. పేమెంట్ బ్యాచ్ మాత్రమే మిగిలింది. వారు కూడా పెద్దగా సోషల్ మీడియాలో కొద్దిగా ఫాలోయింగ్ ఉన్నా… అసభ్య వీడియోలు చేసే వారైనా సరే డీల్ మాట్లాడుకుని ప్రచారం చేయించుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా తాను ఓ డిజాస్టర్ గా మారడమే కాదు.. జగన్ మీటింగ్ ను కూడా అలాగే చేసిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.