బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ – టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
కేసీఆర్ పుష్కరకాలం తర్వాత ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సీఎం అయిన తర్వాత ఏ ఛానెల్ కు కూడా ఇంటర్వ్యూ ఇవ్వని కేసీఆర్ బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మొదటిసారి ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతోన్న సమయంలో టీవీ9 ఎడిటర్ రజినీకాంత్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్ మళ్లీ తాజాగా ఇంటర్వ్యూకు వస్తుండటం.. ఇందులో కేసీఆర్ ఎలాంటి అంశాలపై మాట్లాడుతారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
కేసీఆర్ తాజా ఇంటర్వ్యూతో మోడీపై కూడా చర్చ జరుగుతోంది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశంలో పాల్గొనలేదు.మీడియా సమావేశాలకు మొహం చాటేస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ ఇంటర్వ్యూ కారణంగా మోడీకి మీడియా ఫీవర్ అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
మోడీ అధికారంలో ఉండగా బీజేపీ అనుకూలురుగా ముద్రపడిన జర్నలిస్టులకు మినహా స్వతంత్రంగా వ్యవహరించే ఏ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉదంతాలు లేవు. కేసీఆర్ కూడా సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎవరూ ఇంటర్వ్యూ కోరినా నిరాకరించారు. కానీ, ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడమే గొప్పగా ప్రచారం చేసుకోవడం పాలకుల ప్రజాస్వామ్యయుత పంథాకు నిదర్శమా..? రాజకీయ పార్టీలే ఆలోచించుకోవాలి. ఇంటర్వ్యూ ఇవ్వడమే గొప్పగా ప్రచారం చేసుకోవడం పార్టీల దివాళాకోరు తనమని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. మోడీకి మీడియా అంటే బెరుకు అని ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు పదేళ్ల తర్వాత కేసీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని ప్రమోట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
కేసీఆర్ తో రజినీకాంత్ బిగ్గెస్ట్ చర్చ జరుగుతుండటంతో… బీఆర్ఎస్ వర్గాలు ఈ ఇంటర్వ్యూకు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం సోమవారం ఉదయం నుంచే చేపట్టాయి. రజినీకాంత్ లైవ్‌షో విత్ కేసీఆర్‌తో ప్రోగ్రాంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. నేటి సీఎస్కే మ్యాచ్ ఎవరూ చూడరు.. ఇవాళ టీవీ9 మాత్రమే చూస్తామంటూ పోస్ట్ చేశారు.
కాగా, ఈ చర్చలో కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారోనని ఆసక్తి నెలకొన్నా టీవీ9 యాజమాన్యం కూడా అతి ప్రచారంతో ఇది కేసీఆర్ కు ఎలివేషన్ ఇచ్చినట్లుగా లేదు.ఎడిటర్ రజినీకాంత్ కు ఎలివేషన్ ఇచ్చినట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.