గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం ప్రచారం నత్తనడకన కొనసాగుతోంది.
కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారశైలి ఓ అనామక పార్టీ నుంచి పోటీ చేస్తున్నారా..? అనే అనుమానాలు కలిగేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి తరహాలో దానం ఎన్నికల ప్రచారం లేదని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.సికింద్రాబాద్ లో ప్రధానంగా బీఆర్ఎస్ – బీజేపీ అభ్యర్థుల మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం కనీసం చర్చలో లేకుండా పోయారు.
గత కొన్ని రోజులుగా దానం నాగేందర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే కావడంతో ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో మరో పార్టీ నుంచి పోటీ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు. పదవికి రాజీనామా చేయాలని సూచించినా దానం మాత్రం మొండికేస్తున్నారు. దానంపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ హైకోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత దానంపై అనర్హత వేటు పడితే ఏంటన్నది పార్టీ పెద్దల ఆందోళన. సూరత్ తరహలో సికింద్రాబాద్ కూడా చేజారుతుందా..? అనే అనుమానాలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు దానంకు అక్షింతలు కూడా వేశారన్న గుసగుసలు వినిపించాయి.మరో 48 గంటల్లో పదవికి రాజీనామా చేసి ప్రచారాన్ని స్పీడప్ చేయాలని, స్థానిక నేతలను కలుపుకొని వెళ్లాలని ఆదేశించినా దానం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో దానం నాగేందర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే బొంతు రామ్మోహన్ పేరును ఖరారు చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది. దానం వ్యవహారశైలి ఇలాగే కొనసాగితే గెలిచే స్థానంలో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.