హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున హిందూపురం ఎంపీగా పోటీ చేయాలని భావించి ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గంలో మకాం వేశారు. కానీ ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో చివరికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
హిందూమత బోధనలతో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పరిపూర్ణనంద తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్న పరిపూర్ణ తెలంగాణ అంతటా బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని…అంతటితో ఆగకుండా ఓ సన్యాసి తెలంగాణకు సీఎం కాలేడా..? అంటూ అప్పట్లో పరిపూర్ణనంద చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. యూపీలో యోగి, తెలంగాణలో పరిపూర్ణ అంటూ ప్రచారం చేసుకున్నారు.
ఆ ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో అప్పటి నుంచి రాజకీయాల్లో పెద్దగా కనిపించని పరిపూర్ణనంద స్వామి…మళ్లీ ఏపీ ఎన్నికల వేళ తెరపైకి వచ్చారు. హిందూపురం లోక్ సభ సీటు తనకు వస్తుందనుకున్నారు. పెనుగొండ నియోజకవర్గాన్ని స్థావరంగా చేసుకొని అక్కడి నుంచి రాజకీయం ప్రారంభించారు.ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఆయనకు అండదండలు ఉండటంతో సీటు ఖాయమనుకున్నారు. కానీ, టికెట్ ఇతరులకు ఇవ్వడంతో అందుకు బాలకృష్ణే కారణమని ఆరోపించారు పరిపూర్ణానందస్వామి.
హిందూపురంలో మైనార్టీ ఓట్లు 60 వేలకు పైగా ఉన్నాయి. బీజేపీకి పార్లమెంటు సీటు ఇవ్వడం వలన మైనార్టీ ఓట్లు టిడిపికి పడవని… తన గెలుపు కష్టమవుతుందని బాలకృష్ణ భావించి తనకు టికెట్ ఇవ్వకుండా చేశారని పరిపూర్ణానంద ఆరోపించారు. అయినా తాను హిందూపురం లోక్ సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఇంతలో ఆయన అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేయడంతో… బాలకృష్ణపై ఆగ్రహంతోనే పరిపూర్ణ తన మనసు మార్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయినా టీడీపీ ఓటమి ఎరుగని హిందూపురంలో బాలకృష్ణకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న పరిపూర్ణనంద ఎలాంటి పోటీనిస్తారో చూడాలి.