తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బర్రెలక్క నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు.
డిగ్రీ చదివినా ఉద్యోగం రాలేదంటూ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శిరీషగా ఉన్న ఆమె పేరు బర్రెలక్కగా మారింది. తర్వాత నిరుద్యోగుల సమస్యలపై వరుసగా వీడియోలు చేసి నిరుద్యోగుల వాణి వినిపించారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందంటూ నాటి బీఆర్ఎస్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.
కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క 5వేల పైచిలుకు ఓట్లు సంపాదించారు. ఒక్క రూపాయి పంచకున్నా తనకు ఐదు వేల మంది ఓట్లు వేశారని..ఎన్నికల్లో ఓడినా తాను నైతికంగా గెలిచినట్లు భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఓటమితో కుంగిపోనని… పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని ఆనాడే స్పష్టం చేసింది.
నాడు ప్రకటించినట్లుగానే నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న బర్రెలక్క మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ తరఫున మల్లు రవి, బీజేపీ తరఫున భరత్ పోటీ చేస్తున్నారు.