హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నారు. మాధవీలతకు మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలు కోరుతున్నా ఆమె ప్రచారంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు.
బుధవారం మాధవీలత నామినేషన్ కార్యక్రమంలోనూ రాజాసింగ్ కనిపించలేదు. తాను ఇంచార్జ్ గా కొనసాగుతోన్న ఇలాకాలో పార్టీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొనకపోవడం చర్చనీయాంశం అవుతోంది. మాధవీలతకు ఆయన సపోర్ట్ చేసేందుకు ససేమీరా అంటుండటంతో… రానున్న రోజుల్లోనూ ఆమె తరఫున ప్రచారంలో రాజాసింగ్ పాల్గొంటారా..?లేదా అనే అంశంపై పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలత ఎంపికను రాజాసింగ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తన అభిప్రాయం తీసుకోకుండానే మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడమే రాజాసింగ్ అసంతృప్తికి కారణమా.? లేదంటే మరో నేతను ఎంపిక చేయాలని పట్టుబట్టినా బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదని అగ్రహామా..?అనే చర్చ మొదలైంది.
మాధవీలతకు రాజాసింగ్ మద్దతు లేకపోతే హైదరాబాద్ లో బీజేపీ కనీస పోటీనివ్వదనే వాదనలు వినిపిస్తున్నాయి.హైదరాబాద్ అంతటా రాజాసింగ్ కు ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. అలాంటిది ఆయన సపోర్ట్ లేకపోతే మాధవీలత చెప్పుకోదగ్గ ఓట్లను కూడా పొందలేదని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. దీంతో నేడో, రేపో రాష్ట్ర నాయకత్వం రాజాసింగ్ ను బుజ్జగించి మాధవీలతకు మద్దతిచ్చేలా చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది.