బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పంచ్ డైలాగ్ లు, సామెతలతో కూడిన విమర్శానాస్త్రాలు, ప్రత్యర్ధి పార్టీలకు ఊపిరి సల్పని విధంగా కౌంటర్లు…క్లుప్తంగా చెప్పాలంటే ఇలా ఉంటుంది కేసీఆర్ ప్రసంగం. కానీ, కేసీఆర్ ఇటీవలి ప్రసంగంలో అలాంటి వాటికి చోటు లేకుండా చప్పగా సాగుతుందన్న చర్చ జరుగుతోంది.
తాజాగా ఓ ఛానెల్ కు కేసీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూపై బిగ్ బజ్ క్రియేట్ చేశాయి బీఆర్ఎస్ వర్గాలు. పుష్కరకాలం తర్వాత కేసీఆర్ ఇంటర్వ్యూ ఇస్తుండటంతో పంచ్ డైలాగ్ లతో ప్రత్యర్ధి పార్టీలపై శివాలెత్తుతారనే అంచనాలు తలకిందులు అయ్యాయి. ఇంటర్వ్యూ ఆసాంతం చప్పగా సాగిందని పార్టీ శ్రేణులే అంతర్గతంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక, బుధవారం నుంచి కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్ చేయడంతో తన మార్క్ ప్రసంగంతో పొలిటికల్ సినారియోను మొత్తం చేంజ్ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు ఆశించాయి. కానీ, మిర్యాలగూడలో అక్కడకక్కడ పంచ్ డైలాగ్ లు విసిరారు తప్పితే మునుపటి వాగ్ధాటిని ప్రదర్శించడం లేదని, దీంతో కేసీఆర్ కు ఏమైందంటూ ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.