తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా పరిశీలించారు. అసెంబ్లీ టిక్కెట్ కోసం కూడా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు ఆయనకు పాత అవకాశమే కొత్తగా వచ్చింది. అదే ఎమ్మెల్సీ. ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీకి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు.
నిజానికి ఈ స్థానానికి 2021లో ఎన్నికలు జరిగినప్పుడు మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కోదండరాంను కూడా దాటేసి రెండో స్థానంలో నిలిచారు. 2021లో జరిగిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థల అధినేత. ఆయన తన నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని పట్టభద్రుల ఓట్లను పెద్ద ఎత్తున ఎన్రోల్ చేయించారు. పకడ్బందీగా పోల్ చేయించుకోగలిగారు.
కానీ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ మాత్రం.. తన పోరాటాన్ని నమ్ముకున్నారు. రాజకీయంగా ఎదగాలనే ఆకాంక్ష ఉన్న ఆయన తరచూ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు. అంతకు ముందు హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే కనీస ప్రభావం కూడా చూపించలేదు. ఇ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి.. రెండో స్థానంలో ఉన్నారు. ఉద్యమ నేతగా అందరి ప్రశంసలు పొందిన కోదండరాం కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ మల్లన్న తర్వాత స్థానంలోనే ఉండిపోయారు.
ఇప్పుడు అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. గతంలో మిస్ అయిన విజయం ఈసారి వస్తుందని మల్లన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈసారి గెలిచినా ఆ ప దవి మూడేళ్లే ఉంటుంది.