సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి వస్తోంది. కోర్టులే అలా అనుకుంటే ఇక ప్రజలు ఎలా అనుకుంటారో చెప్పాల్సిన పని లేదు. తాజాగా గుల్జార్ అనే ఐఏఎస్ అధికారి .. తీరుతో విసుగు చెందిన హైకోర్టు మిమ్మల్ని ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
సదరు గుల్జార్ చేసింది రాజ్యాంగ విరుద్ధమన పని. దిద్దుకోమని హైకోర్టు చాన్సిచ్చినా.. మా రాజ్యాంగం వేరే అన్నట్లుగా వ్యవహరించారు. ఈ దుస్థితికి వచ్చారు. ఈ గుల్జార్ ఒక్కరేనా అంటే.. క్రిమినల్ రికార్డు ఉన్న సీఎం పరిపాలనలో ప్రాధాన్య పోస్టుల్లో ఉన్న ప్రతి ఐఏఎస్, ఐపీఎస్ ది అదే పరిస్థితి. ఎంత మందిపై కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయో.. ఎంత మందికి శిక్షలు పడ్డాయో లెక్కలేయడం కష్టం. జగన్ తో పాటు ప్రాధాన్య పోస్టుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కోర్టు ధిక్కరణ కేసుల్లో శిక్షకు గురయ్యారు. డివిజనల్ బెంచ్ కు వెళ్లి ఎలాగోలా శిక్షలపై స్టే తెచ్చుకున్నారు. కానీ చేసిన తప్పులు మాత్రం తుడిచేసుకోలేరుగా !
ముస్సోరిలో సివిల్ సర్వీస్ అధికారులకు చెప్పి పంపేది.. రాజ్యాంగాన్ని పాటించమని. కానీ ఏపీలో కొంత మంది మాత్రం… జగన్ రెడ్డిరాజ్యాంగమే గొప్ప అన్నట్లుగా మారిపోయారు. ప్రాధాన్య పోస్టుల కోసం పాలకులు చెప్పిన అడ్డగోలు పనులు చేయడానికి అలవాటుపడిపోయారు. అది వారికి కెరీర్ లో ఎన్నో మచ్చల్ని తెచ్చి పెట్టింది. కోర్టుల్లో శిక్షకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సివిల్ సర్వీస్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. కోర్టుల్లో శిక్ష పడితే… అది దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇలాంటి సివిల్ సర్వీస్ అధికారుల వల్ల.. అసలు వ్యవస్థ రిప్యూటేషనే దెబ్బతింటోంది.