ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని కూటమి అభ్యర్థి పులివర్తి రామాంజనేయులు చెబుతున్నారు. కూటమి ప్రయోజనాల కోసం తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని.. పవన్ ఇప్పటికే ప్రకటించారు. భీమవరంలో గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భీమవరంలో ప్రధాన రాజకీయ అంశంగా రౌడీయిజం మారింది. పవన్ పై గెలిచినప్పటి నుండి గ్రంథి శ్రీనివాస్ భీమవరం మొత్తాన్ని రౌడీల గుప్పిట్లో పెట్టి పరిపాలన చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపబోతున్నాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా భీమవరం నియోజకవర్గం ఉండేది. తర్వాత వరుసగా మూడు సార్లు ఓడిపోయిన తర్వాత 2014లో మళ్లీ పులవర్తి రామాంజనేయులు టీడీపీ తరపున గెలిచారు. అంతకు ముందు ఆయన కాంగ్రెస్ తరపున గెలిచారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు 70 వేల 643 ఓట్లు రాగా, పవన్ కళ్యాణ్‌కు 62 వేల 288 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ తరఫున పోటీ చేస్తున్న రామాంజనేయులు 52 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అంటే టీడీపీ, జనసేనకు కలిసి వచ్చిన ఓట్లు లక్షా పధ్నాలుగు వేలు, వైసీపీకి వచ్చిన ఓట్లు 70 వేలు. ఎలా చూసినా 44వేల ఓట్ల మెజార్టీ కనిపిస్తోంది.
నియోజకవర్గంలో మొత్తం 2 రెండున్నర లక్షలపైగా ఓట్లు ఉన్నాయి. భీమవరం పట్టణంతోపాటు భీమవరం రూరల్, వీరవాసరం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తారు. క్షత్రియ సామాజిక వర్గ నేతలు, కాపులే భీమవరం ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మొదట్లో క్షత్రియ నేతలకు చాన్స్ ఇచ్చేది. క్రమంగా కాపులకు అప్రకటిత రిజర్వుడు నియోజకవర్గంగా మారింది. కాపు ఓటర్లే సుమారుగా 80 వేల వరకు ఉంటారు. సామాజికవర్గాల పరంగా చూస్తే.. కాపు సామాజికవర్గంపై వైసీపీ ఏకపక్ష దాడి చేస్తూండటంతో ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ అభ్యర్థి కాకపోయినా జనసేనపై సానుభూతి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం కాపు వర్గానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ సారి జనసేన జెండా ఎగురవేయడానికి కాపు వర్గం పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఇక క్షత్రియులు వైసీపీకి పూర్తిగా దూరమయ్యారు.
భీమవరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు వైసీపీ హైకమాండ్ అన్ని రకాలుగా సాయం చేస్తోంది. కానీ ఐదేళ్లలో ఆయన చేసిన అరాచకాలు.. జనసైనికుల్ని రెచ్చగొట్టిన వైనంతో… తీవ్ర వ్యతిరేకత పెరిగింది. కూటమి అభ్యర్థికి భీమవరంలో స్పష్టమైన అనుకూలత కనిపిస్తోందన్న అంచనాలు బలంగా ఉన్నాయి.