బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్ రోడ్ల మీద డిస్ ప్లే చేస్తామని చెబుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీపై నిందలేస్తూ చార్జిషీటు వేస్తే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఇదే చేసింది. ఇంకా చెప్పాలంటే ఇంత కంటే ఎక్కువే చేసింది.
బీఆర్ఎస్ పార్టీ బీజేపీపై ఓ సీజన్ లో పోరాటం.. మరో సీజన్ లో సైలెంట్ అనే రాజకీయం చేసింది. పోరాటం చేసినప్పుడల్లా ఈ పోస్టర్లు హైదరాబాద్ అంతటా వెలిసేవి. తెలంగాణకు ఎవరైనా బీజేపీ ముఖ్యులు వస్తే వారు వచ్చి వెళ్లే దారిలో కనిపించేవి. ప్రధాని వచ్చినా తెలంగాణకు ఇలా అన్యాయం చేశారని పోస్టర్లు వేసేవారు. వీటిని చూసి చూసి ప్రజలకు కూడా చిరాకొచ్చింది. ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పోస్టర్ల రాజకీయం చేస్తోంది. చార్జిషీట్ వేసి విమర్శలు ప్రారంభించింది.
ఒక ఫెయిల్డ్ స్ట్రాటజీని పదే పదే అమలు చేసే బదులు కొత్త కాన్సెప్ట్ తో ప్రయత్నించవచ్చు కదా అనే సలహాలు కాంగ్రెస్ కు వస్తున్నయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీపై ఎన్ని పోస్టర్లు వేసినా ప్రయోజనం ఉండదని గతంలో కేసీఆర్ చేసిన ప్రచారం వల్లే తేలిపోయింది. బీజేపీని ఆ పార్టీ ఏది హైలెట్ అనుకుంటోందో వాటినే డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేయాలి.కానీ బీజేపీ హిందూ – ముస్లిం రాజకీయం చేస్తోంది. దీనికి కౌంటర్ ఇస్తే కాంగ్రెస్ కే నష్టం జరుగుతుందని.. పాత పద్దతిలోనే పోరాటం చేస్తున్నారు.