పోలవరం ప్రాజెక్టుపై ఈరోజు ఏపి శాసనసభలో జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకి మధ్య తీవ్ర వాదోపవాదాలు సాగాయి.
ఆ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు పనులు చేయడంలో అనుభవం లేదని ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పటికీ వారిని తొలగించి, మంచి అనుభవం ఉన్నవారికి ఆ పనులు అప్పగించేందుకు కొత్తగా టెండర్లు పిలవకపోగా, ఆ కాంట్రాక్టర్లనే కొనసాగించడం, ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వారికే అదనంగా కోట్లాది రూపాయలు ముట్టజెప్పుతూ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న ఆ భారీ అవినీతిని చూసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆ ఫైళ్ళపై సంతకాలు పెట్టడానికి భయపడిపోయారంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న ఆ అవినీతిని చూసే కేంద్రప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేయడానికి వెనకాడుతోందని జగన్ అన్నారు.
దానికి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా చాలా ధీటుగా జవాబిచ్చారు. “మా ప్రభుత్వం రాయలసీమకు నీళ్ళు అందించేందుకు పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెడితే దానిని అడ్డుకోవాలని జగన్ విశ్వప్రయత్నాలు చేసారు. అలాగే ఇప్పుడు మేము పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే, దానికి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాలని డిమాండ్ చేస్తూ దానినీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్న ఎల్ అండ్ టి, జర్మనీ సంస్థలు నా బినామీ సంస్థలు…అందుకే నేను వాటికి లబ్ది చేకూర్చడానికి ప్రయత్నిస్తునన్నట్లు జగన్ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.”
“నిజానికి రాజశేఖర్ రెడ్డి హయంలో ధనయజ్ఞం పేరిట ‘నవగ్రహాలు’ కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడిన సంగతి అందరికీ తెలుసు. అంత డబ్బు ఖర్చు చేసినా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆయన హయంలో అసంపూర్తిగా వదిలిపెట్టిన పనులన్నిటినీ మా ప్రభుత్వం ప్రాధాన్యత ప్రకారం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తుంటే, మెచ్చుకోవలసింది పోయి తిరిగి మాపైనే విమర్శలు చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాదని, అయితే మేము చేతులు, కాళ్ళు కోసుకొంటామని ఆనాడు వైకాపా ఎమ్మెల్యేలు ఇదే సభలో శపధాలు చేసారు. మేము చెప్పినట్లుగానే ఆ ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేసి చూపించాము. కానీ ఇప్పుడు మీవాళ్ళు ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాజెక్టు కూడా పూర్తయితే ఈ పార్టీని ఇక ఎవ్వరూ పట్టించుకోరని మీరు భయపడుతున్నందునే ఈవిధంగా లేనిపోని ఆరోపణలు చేస్తూ అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారు కానీ దానిని కూడా మీరు అడ్డుకోలేరు. వచ్చే ఎన్నికల నాటికి దానిని కూడా తప్పకుండా పూర్తి చేసి చూపిస్తాము,” అని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు జవాబిచ్చారు.
వారిరువురూ కూడా పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలనే వాదోపవాదాలు చేసుకొన్నారు. కానీ ఇద్దరూ పూర్తి భిన్నమయిన వాదనలు వినిపించారు. వారి వాదనలలో నిజానిజాలు తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడక తప్పదేమో? ఎందుకంటే “అప్పటికి పోలవరం ప్రాజెక్టుని తప్పకుండా పూర్తి చేసి చూపిస్తాము వ్రాసిపెట్టుకోండి” అని జగన్మోహన్ రెడ్డికి మంత్రి దేవినేని గట్టిగా చెప్పారు కదా!