కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని .. తాను తెలంగాణ కోసమే ఉంటానని చెబుతున్నారు. నిజంగా ఈ విషయంపై కేసీఆర్ కు ఇంతకు ముందే క్లారిటీ ఉంటే ఇప్పుడు ఆయనకు ఇలా చెప్పుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. తాను తెలంగాణను ఉద్దరించేశానని దేశం కోసం బయలుదేరినందునే ఆయనను ప్రజలు ఓడగొట్టారు. ఇప్పుడు మళ్లీ తాను తెలంగాణ కోసమే పుట్టానని ప్లీజ్ నమ్మండి అంటూ బయలుదేరారు.
కేసీఆర్ బలం, బలగం తెలంగాణ. ఆయనకు సామాజికవర్గ బలం లేదు. కానీ తెలంగాణ అనే సెంటిమంట్ ను ఆయన గట్టిగా ఒడిసి పట్టుకున్నారు. ఆంధ్రోళ్లను తిట్టో… మరో ఆశ చూపో.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టగలిగారు. తాను అనుకున్నది సాధించారు. ఆయన పై ప్రజలకు నమ్మకం లేదని.. కానీ ఆయన ముందు పెట్టిన ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం వంటి వాళ్లను నమ్మి ప్రజలు ఆయనకు మొదట్లో కొన్ని సీట్లు ఇచ్చారని అంటారు. అయితే కేసీఆర్ తర్వాత దాన్ని తన శక్తిగానే నమ్మించగలిగారు.
కానీ తెలంగాణ బాపు అంటూ ప్రచారం చేసుకున్నా ఆయన .. ఎప్పుడైనా తెలంగాణను కాదని దేశ రాజకీయాలకు పోతానని చెప్పడం ప్రారంభించారో అప్పుడే తెలంగాణలో డిస్ కనెక్ట్ కావడం ప్రారంభించారు. పార్టీ పేరును కూడా మార్చడంతో ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ తెగిపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ సారి తెగిపోయిన దారాన్ని అతికించడం ఎంత కష్టమో… ప్రజల్లో కోల్పోయిన తనపై నమ్మకాన్ని మళ్లీ తెచ్చుకోవడం కూడా అంతే కష్టం. కేసీఆర్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కానీ ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు.