రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుండగా సాయి చరణ్ అనే బాలుడు వారి పాలిట ప్రత్యక్ష దైవంగా నిలిచాడు. దట్టమైన మంటలు చెలరేగుతున్నా సమయస్పూర్తిని ప్రదర్శించి యాభై మంది ప్రాణాలను కాపాడాడు.
ఫార్మా కంపెనీ సమీపంలో నివసించే సాయి చరణ్ అనే బాలుడు స్థానికంగా చెలరేగిన మంటలను గమనించాడు. మరేం ఆలోచించకుండా వెంటనే భవనం పైకెక్కి తాడు కట్టి కిందకు వదిలాడు. ఆ తాడు సాయంతో మంటల్లో చిక్కుకున్న యాభై మంది బిల్డింగ్ పైనుంచి కిందకు సేఫ్ గా దిగారు. ఆ సమయంలో సాయి చరణ్ ఆ సమయస్పూర్తిని ప్రదర్శించకుంటే వారు సజీవదహనం అయ్యేవారని … బాలుడి సాహసాన్ని పోలీసులతో సహా కంపెనీ యాజమాన్యం అభినందించింది.
షాద్ నగర్ నందిగామ శివార్ సమీపంలోని ఫార్మా కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఉద్యోగులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సమయంలో ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ నలుగురు బిల్డింగ్ పైకి ఎక్కి కిందకు దూకేశారు. ఈ నేపథ్యంలోనే సమయస్ఫూర్తితో ఆలోచించి బిల్డింగ్ పైకి ఎక్కి తాడు కట్టిన సాయి చరణ్ మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచాడు.