ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ క్రెడిట్ అంతా దర్శకుడి ఖాతాలో వేసుకునే సందర్భాలు కోకొల్లలు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం ఎవరి క్రెడిట్ వారికి ఇచ్చేస్తారు. పైగా బహిరంగ వేదికలపై వాళ్ళ చేసిన పని గురించి మొహమాటం లేకుండా గొప్పగా చెప్తారు. దర్శకుడు సుకుమార్ ఈ కోవలోకే వస్తారు.
సుకుమార్ స్కూల్ నుంచి బోలెడు మంది దర్శకులు తయారౌతున్నారు. బుచ్చిబాబు, కార్తిక్ దండు, శ్రీకాంత్ ఓదెల ఇప్పటికీ నిరూపించుకున్నారు. ఇప్పుడు అర్జున్ వంతు వంచ్చింది. సుకుమార్ అసోసియేట్ గా పని చేసిన అర్జున్.. సుహాస్ తో ప్రసన్న వదనం సినిమా తీశాడు. మే3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో అర్జున్ గురించి సుకుమార్ చెప్పిన తీరు ఖచ్చితంగా ప్రశంసించదగ్గది.
సుకుమార్ ని అందరూ లాజిక్ మాస్టర్ అంటారు. అయితే దీనికి కారణం అర్జున్ అని నిర్మోహమాటంగా చెప్పారు సుకుమార్.” అర్జున్ అమాయకుడు. కానీ బోలెడు లాజిక్ ఉన్నవాడు. అర్జున్, మరో అసిస్టెంట్ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో ‘100% లవ్’ స్టోరీ రాశా. అప్పటి నుంచి నా ప్రతి సినిమాకి వీరిద్దరు పనిచేశారు. అర్జున్ బిజీగా ఉండడంతో నేను లాజిక్ ఉన్న సినిమాలను మానేశా. అంటే మీరే అర్ధం చేసుకోవచ్చు” అని సుకుమార్ ఇచ్చిన కితాబు… నిజంగా కొత్త దర్శకుడికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుందనే చెప్పాలి. లాజిక్ అంటే సుకుమార్, సుకుమార్ అంటే లాజిక్ అనుకొనేవాళ్లకు.. ఆ లాజిక్ వెనుక ఎవరున్నారో ఇన్నాళ్లకు అర్థమైంది. ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో.. వాళ్లకు ఇచ్చేసిన సుకుమార్ నిజంగా.. సూపర్!