ఏపి శాసనసభలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసారు. పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక అంశాలను సాకుగా చూపించి కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు అదనంగా ముట్టజెప్పి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. దానికి మంత్రి దేవినేని కూడా చాలా ఘాటుగానే సుదీర్గమైన జవాబే చెప్పారు కానీ దానిలో జగన్ లేవనెత్తిన అసలు ప్రశ్న-కాంట్రాక్టర్లకు అదనపు సొమ్ము ముట్టజెప్పడం గురించి సమాధానం చెప్పనేలేదు.
అప్పుడు బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు మధ్యలో కలుగజేసుకొని, “కాంట్రాక్టర్లకు అదనపు సొమ్ము చెల్లించడం గురించి ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగారు. దానిపై వాదోపవాదాలు చేసుకోవడం ఎందుకు? ఆ ప్రశ్నకు అవును లేదా కాదు అని జవాబి చెపితే సరిపోతుంది కదా? ప్రతిపక్ష నేత అడిగిన ఆ ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పమని నేను ప్రభుత్వాన్ని ఎందుకు కోరుతున్నానంటే దానికి జవాబు చెప్పకపోతే ప్రజలలో కూడా అనుమానాలు కలుగుతాయి. కనుక కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అధనంగా డబ్బు చెల్లించిందా…లేదా? మంత్రిగారు చెపితే బాగుంటుంది,” అని అన్నారు.
అయితే ఆయన చేసిన సూచనను దేవినేని పట్టించుకోకుండా పోలవరం ప్రాజెక్టు గురించి సుదీర్గమయిన వివరణ ఇచ్చారు. ఆ తరువాత స్పీకర్ కలుగజేసుకొని ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాలపైనే సభలో చర్చిస్తూ కూర్చుంటే మిగిలిన శాఖలకు చెందిన సమస్యలు, పనుల గురించి చర్చించలేమని వేరే అంశం మీదకు చర్చను మళ్ళించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ తీవ్ర ఆరోపణలకి మంత్రి జవాబు చెప్పకుండానే చర్చ ముగిసిపోయిందన్న మాట. చివరికి మిత్రపక్షం చెప్పినా పట్టించుకోలేదంటే ఏమనుకోవాలి?