262 పరుగుల లక్ష్యం..
ఒకప్పుడు వన్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఛేజింగ్ టీమ్ ఆపసోపాలు పడేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిపడేశారు. శుక్రవారం కొలకొత్తా నైట్ రైడర్స్ – కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ రికార్డ్ బద్దలైంది. 261 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు సునాయాసంగా సాధించేసింది. ఇది వరల్డ్ రికార్డ్. ఐపీఎల్లో ప్రపంచ రికార్డ్ మ్యాచ్ చూశామని ఆనందపడాలా, బ్యాటర్లు పండగ చేసుకొంటున్నారని సంతోషించాలా, లేదంటే ఈ ఆటలో బౌలర్లు బలిపశువులు అవుతున్నారని బాధ పడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
టీ 20ల్లో బ్యాటర్లదే ఆధిపత్యం. కానీ… బౌలర్లు కూడా మ్యాచ్ విన్నర్లే. 140 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొన్న సందర్భాలు కోకొల్లలు. ఐపీఎల్ లో ఇలాంటి మ్యాచ్‌లు ఎన్నో చూశాం. కానీ కాలక్రమంలో పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా తయారు చేస్తున్నారు. ఐపీఎల్ లో 200 పరుగులు చాలా కామన్ అయిపోయింది. హైదరాబాద్ దాదాపుగా 300 పరుగులకు దగ్గరకు వచ్చేసింది. హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో 250 పైచిలుకు పరుగుల్ని మూడుసార్లు సాధించింది. 250 పైగా స్కోర్ ఈ సీజన్లో ఏకంగా 5 సార్లు నమోదయ్యింది. పీచ్‌లో పస లేదు. బ్యాట్ పైకి బంతి చాలా ఈజీగా వస్తోంది. దాంతో అనామక ఆటగాళ్లు కూడా విజృంభించి షాట్లు కొడుతున్నారు. ప్రపంచ స్థాయి బౌలర్లు నరేన్, కమిన్స్, మిచెల్ స్టార్క్, భువనేశ్వర్ కుమార్, రషిద్ ఖాన్ లాంటి వాళ్లే ధారాళంగా పరుగులు సమర్పించుకొంటున్నారు. చివరి ఓవర్ 20 పరుగులు టార్గెట్ ఉన్నా కాపాడుకోలేని పరిస్థితులు. క్రికెట్ లో ఇది వరకు బౌలింగ్, బ్యాటింగ్ ఈ రెండు విభాగాలూ సమఉజ్జీలుగా ఉండేవి. ఇన్నింగ్స్ ఆరంభంలో ఇది వరకు బంతులు బాగా స్వింగ్ అయ్యేవి. మధ్యలో మ్యాచ్‌ను స్పిన్నర్లు మలుపు తిప్పేవారు. ఇప్పుడు అలాంటి సందర్భాలు చూసే అవకాశమే ఉండడం లేదు. చూస్తుంటే ఐపీఎల్ లాంటి టోర్నీల వల్ల బౌలర్లు బలిపశువులుగా తయారవుతున్నారేమో అనే బెంగ వేస్తోంది. వచ్చే ఐపీఎల్ వేలంలో బౌలర్లకు భారీ మొత్తం వెచ్చింది టీమ్ లో తీసుకోవడం ఇక జరగదేమో? బౌలర్ ఎవరైనా బాదేస్తోంటే, ఇక స్పెషలిస్ట్ బౌలర్లు ఎందుకు? జట్టులోని 11 మందినీ బ్యాట్స్మెన్లనే తీసుకొని, వాళ్లతోనే చెరో రెండు ఓవర్లు బౌలింగ్ వేయించేస్తే సరిపోతుంది. భవిష్యత్తులో ఇలా ఆలోచించే రోజులూ వస్తాయేమో..?