మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. నాలుగేళ్లుగా రాజధానిపై కాలయాపన చేసిన జగన్ మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగానైనా పరిపాలన కొనసాగిస్తారా.? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
2014లో ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీకి రాజధానిగా అమరావతిని నాటి టీడీపీ సర్కార్ నిర్ణయించింది. కానీ,2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా ప్రకటించింది. నాలుగేళ్లు అవుతున్నా రాజధానుల విషయంలో వైసీపీ సర్కార్ ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది.
మూడు రాజధానుల పేరుతో ఉన్న ఒక్క రాజధానిని కూడా లేకుండా చేశారని నాలుగేళ్లుగా జగన్ సర్కార్ పై ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ఖండంతారాల్లో ఉన్న ఏపీ వాసులు కూడా జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై పెదవి విరిచారు. ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారని జగన్ సర్కార్ పై సొంత చెల్లి షర్మిలతో సహా ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
ఇది వైసీపీకి ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారుతుందని అంచనా వేశారేమో కానీ, మేనిఫెస్టో విడుదల సందర్భంగా వైసీపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక విశాఖ కేంద్రంగా పరిపాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దసరా నాటికి విశాఖ వేదికగా పరిపాలన అంటూ వైసీపీ నేతలు ఊదరగొడుతూ వచ్చినా అది సాధ్యం కాలేదు. చట్టపరంగా మూడు రాజధానులు సాధ్యం కాదని తెలిసినా మేనిఫెస్టోలో చేర్చడం ఆశ్చర్యపరుస్తోంది.దాంతో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో ముందడుగు పడేనా అంటూ జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.