గత వారం రోజులుగా సాక్షి పత్రికలో రాజధాని బినామీ భూముల వ్యవహారాల గురించి వరుస కధనాలు ప్రచురిస్తూ తెదేపా నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దానిపై శాసనసభలో కూడా గట్టిగా నిలదీస్తామని వైకాపా చెప్పుకోవడంతో తెదేపా ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదురవుతాయని అందరూ ఊహించారు. కానీ మళ్ళీ ఈ వ్యవహారంలో కూడా తెదేపాయే సభలో వైకాపామీద పైచెయ్యి సాధించడం ఆశ్చర్యం కలిగించింది.
జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవహారాల గురించి మాట్లాడి తెదేపా మంత్రులు, నేతలపై విమర్శలు గుప్పించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి ఒక సవాలు విసిరారు. రాజధాని భూములపై సాక్షి పత్రికలో ప్రచురించిన వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉండాలని అన్నారు. సాక్షిలో ప్రచురించిన దాని ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు తెదేపా నేతల బినామీలు కొన్నట్లుగా చెపుతున్న ఆ భూముల సర్వే నెంబర్లు, కొన్నవారి పేర్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. వాటిపై తను విచారణ జరిపించి, ఆ ఆరోపణలు నిజమని తేలినట్లయితే తక్షణమే ఆ మంత్రులను మంత్రివర్గం నుండి తొలగిస్తానని, ఒకవేళ వాళ్ళు నిర్దోషులని తేలితే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి శిక్ష విధించాలో ఇదే సభలో నిర్ణయిద్దామని ముఖ్యమంత్రి సవాలు విసిరారు. ఇప్పటికయినా జగన్మోహన్ రెడ్డి తను చేసిన ఆరోపణలు నిజం కాదనుకుంటే ఆరోపణలు చేసినవారందరికీ సభలో క్షమాపణలు చెప్పి, మిగిలిన విషయాలపై మాట్లాడవచ్చునని అన్నారు.
కార్మిక శాఖ మంత్రి అచ్చెం నాయుడు కూడా ముఖ్యమంత్రి విసిరిన ఆ సవాలుని స్వీకరించమని జగన్మోహన్ రెడ్డిని పదేపదే గట్టిగా అడిగారు. లేకుంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు మంత్రులకు క్షమాపణలు చెప్పుకొని, లెంపలు వేసుకొని సభలోంచి బయటకు వెళ్ళిపోవాలని సూచించారు.
ఈసారి శాసనసభ సమావేశాలలో జగన్మోహన్ రెడ్డిని తెదేపా ఏవిధంగా ఎదుర్కొటుందా…అని అందరూ చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డే ఈవిధంగా తెదేపాకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఎదురవడం చూసి అందరూ ఆశ్చర్యపోకుండా ఉండలేరు.