తోటపల్లి మధు… ఈ తరానికి పెద్దగా ఈ రచయిత పేరు తెలియకపోవొచ్చు కానీ, 90ల్లో వచ్చిన కొన్ని సినిమాలకు ఆయన మాటలు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. నటుడిగానూ తనదైన ముద్ర వేయాలని చూసి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీనే. అందుకే.. ఊసుపోక ఓ యూ ట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చి ఇరుక్కున్నాడు. ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్పు కాదు, కానీ అందరి దృష్టీ తనపై పడాలనో, ఫోకస్ ఉండాలనో, మళ్లీ ఏదోలా ఫేమస్ అవ్వాలనో… నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్పు. అలాంటి తప్పు ఓ సీనియర్ రచయిత చేయడం ఇంకా పెద్ద తప్పు.
ఇంటర్వ్యూలో చాలా విషయాలు ప్రస్తావించారు తోట పల్లి మధు. అందులో సగం వరకూ దిగ్గజ నటీనటుల్ని, దర్శకుల్ని, నిర్మాతల్ని కించపరిచే, వాళ్ల ప్రతిష్టకు భంగం కలిగించి, వాళ్ల క్యారెక్టర్లని తగ్గించే విషయాలే ఎక్కువ వినిపించాయి. జంధ్యాల, సావిత్రి, కోడిరామకృష్ణ, శ్రీదేవి, కోదండరామిరెడ్డి ఇలా ఒకరా ఇద్దరా… చాలామంది దిగ్గజాల గురించి, వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగింది? ఎవరెవరు తాగుడుకు బానిస అయ్యారు? ఎవరి వల్ల ఎవరి జీవితాలు నాశనం అయ్యాయి? అనే విషయాల్ని ఆయనేదో పక్కనుండి చూసినట్టే పూస గుచ్చి వివరించారు. మురళీమోహన్పైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు ఆయన నటుడే కాదన్నట్టు… ఏవేవో మాట్లాడారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో కాక రేపుతోంది. ఇలాంటి ఎగస్ట్రా విన్యాసాలు ఆపకపోతే.. మీ గురించి మేం స్పందించాల్సి ఉంటుందంటూ సీనియర్ దర్శకుడు, రచయిత దేవి ప్రసాద్ నేరుగా సోషల్ మీడియా ద్వారానే స్పందించడం విశేషం. కోడిరామకృష్ణ, కోదండరామిరెడ్డి శిష్యులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్లు ఇప్పుడు తోటపల్లి మధుని టార్గెట్ చేస్తున్నారు. ఆయనపై చిత్రసీమ పెద్దలకు ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మనమధ్య లేనివాళ్ల గురించి, చెడుగా మాట్లాడడం సభ్యత కాదు. ఈ విషయం ఇంత పెద్ద రచయితకు అర్థం కాకపోవడం దురదృష్టకరం.