జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా జనసేన వ్యక్తం చేసిన అభ్యంతరం ఈసీ పరిశీలనలో ఉందని 24 గంటల్లో నిర్ణయం ప్రకటిస్తామని ఈసీ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను బుధవారానికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
నిబంధనల ప్రకారం గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈసీ స్వయంగా గుర్తును పార్టీకి రిజర్వ్ చేసింది. ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నది ఈసీకి సంబంధం లేని విషయం. ఆ పార్టీకి గుర్తు రిజర్వ్ చేసినందున మరో పార్టీకి లేదా అభ్యర్థికి ఆ గుర్తు కేటాయించకూడదు. కానీ రిటర్నింగ్ అధికారులకు స్పష్టమైన సమాచారం , విధివినాధాలపై సమాచారం లేకపోవడంతో దాదాపుగా యాభై నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గుర్తులను కేటాయించారు.
వెంటనే జనసేన పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ అభ్యంతరంపై ఈసీ ఏ క్షణమైనా నిర్ణయం తీసుకోనుంది. ఒక వేళ సానుకూలంగా నిర్ణయం తసుకోకపోతే హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ తరపు లాయర్ వాదనలు వినిపించారు. తాము అలయెన్స్ లో భాగంగా పోటీ చేస్తున్నామని గాజు గ్లాస్ గుర్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు ప్రచారం చేస్తారని అలాంటప్పుడు ఇతరులకు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడం కరెక్ట్ కాదని లాయర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకెల్లారు.
మరో వైపు టీడీపీ నేతల కనకమేడల కూడా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ను స్వతంత్ర అభ్యర్థులకు, ఇతర పార్టీలకు కేటాయించడాన్ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలో కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయని, పొత్తుల్లో భాగంగా జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును రిటర్నింగ్ అధికారులు కేటాయించారని ఫిర్యాదు చేశారు. ఫలితంగా కూటమి పార్టీలపై ప్రభావం పడుతుందని, ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా పోతుందని టర్లు గందరగోళానికి గురవుతారన్నారు.