నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల ప్రజలను కలిసిన లోకేష్..తాజాగా వారం రోజుల పాటు ఒంగోలు నుంచి సీమ వరకూ ప్రచారం చేసేందుకు వెళ్లారు. లోకేష్ వెళ్లడానికి ఒక్క రోజు ముందే మంగళగిరి వచ్చిన నారా బ్రహ్మణి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు
నారా లోకేష్ మహిళల కోసం స్త్రీశక్తి అనే కార్యక్రమంతో పాటు చేనేతలకు, ఇతర వర్గాలకు సాయం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అలాగే తనేరియా బ్రాండ్ ద్వారా మంగళగిరి చేనేత చీరలు అమ్మించేందుకు నారా బ్రాహ్మణి ఒప్పందం చేయించారు. ఇలాంటి సేవలతో పాటు ఆమె మంగళగిరి మహిళల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకుని వారు స్వయం ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు వెళ్లి మాట్లాడుతున్నారు.
మంగళగిరి పట్టణంలోనే చేనేతలు, స్వర్ణకారులు, పచ్చళ్ల తయారీదారులు ఇలా అన్ని చోట్లకు వెళ్తున్నారు. నేరుగా ఓటు వేయాలని అడగడం కాకుండా.. మంచి చెడులూ కనుక్కుని లోకేష్ గెలిచిన తర్వాత ఏం చేస్తారో .. ఎంత మేలు జరుగుతుందో వివరిస్తున్నారు. వారిలో ఓటు వేయాలన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. ఎక్కడకు వెళ్తున్నా మహిళలతో కలిసిపోతున్న బ్రాహ్మణి ప్రచార శైలి అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎన్నికల తర్వాత లోకేష్ తో కలిసి మరోసారి మంగళగిరిలో పర్యటిస్తానని అందర్నీ కలుస్తానని బ్రాహ్మణి భరోసా ఇస్తున్నారు.