కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా..? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా..? ఇరిగేషన్ , విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర శాఖలో కూడా బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారా..? సర్కార్ కు తలనొప్పి తెచ్చేలా తాజాగా ఓయూ చీఫ్ వార్డెన్ విడుదల చేసిన సర్క్యులర్ తో ఇప్పుడివే ప్రశ్నలు ప్రభుత్వ పెద్దల్లో మెదులుతున్నాయి.
ప్రభుత్వ సమాచారం ముందే లీక్ అవుతుండటంతో ఇప్పటికే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్…లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ అధికారులు ఎవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్విరామంగా విద్యుత్ సరఫరా చేయాలని, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. అయినప్పటికీ అక్కడక్కడ కరెంట్ కోతలు, తాగునీటి ఇబ్బందులు తలెత్తడంపై ఆరా తీయగా అధికారులే బీఆర్ఎస్ కు మేలు చేసేలా ఈ విధంగా వ్యవహరిస్తున్నారని బయటపడింది. దీంతో వారిపై లోక్ సభ ఎన్నికల తర్వాత యాక్షన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ హాయాంలో ఆర్థికంగా , ఉద్యోగపరంగా ప్రయోజనం పొందటంతో ఆఫీసర్లు బీఆర్ఎస్ లీడర్లతో టచ్ లోకి వెళ్తున్నారని ప్రభుత్వానికి చెందిన సమాచారాన్ని లీక్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యుత్ , తాగునీటి కొరత కారణంగా ఓయూ హాస్టల్స్ మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ సర్క్యులర్ జారీ చేయడం రాజకీయ దుమారం రేగింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనం కల్గించేందుకు ఓ అధికారి ఒత్తిడి మేరకు వార్డెన్ ఈ సర్క్యులర్ జారీ చేసినట్లుగా చర్చ జరుగుతోంది. ఇలా బీఆర్ఎస్ నేతలతో ఎవరెవరు టచ్ లో ఉన్నారని గుర్తించి రిపోర్ట్ ఇవ్వాలని రేవంత్ తాజాగా ఆదేశించినట్లుగా తెలుస్తోంది.