నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను కుటుంబం లేని వారు అన్నారని చెప్పి ..అందరితో మోదీకా పరివార్ అనిపించాలనుకున్నారు. కానీ అది ఎక్స్ లో పేరు పక్కన బీజేపీ నేతు పెట్టుకోవడంతో సరిపోయింది. ఎవరూ పట్టించుకోలేదు. ఈ ప్రయోగాలు ఫెయిలవుతూంటే.. ఆయన ప్రచార వ్యూహం రాను రాను బేలగా మారిపోతోంది.
400 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నామని ప్రకటించగానే .. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాలు ప్రారంభించాయి. రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా ప్రసంగించిన ఫేక్ వీడియో వైరల్ అయింది. అది ఫేక్ వీడియో అని అందరికీ తెలుసు.. కానీ వైరల్ అవడానికి కారణం.. ఆరెస్సెస్ విధానాలు, రాజ్యాంగమార్పుపై బీజేపీ నేతలు చేసిన ప్రకటనలే. వారి తీరు అలా ఉంది కాబట్టే ప్రజలు నమ్మడం ప్రారంభించారు. అందుకే మోదీ తన ప్రాణం ఉన్నంత వరకూ రాజ్యాంగం, రిజర్వేషన్ల జోలికి ఎవరూ రారని అంటున్నారు. ఇలా చెప్పుకోవాల్సి రావడమే ఓ ఫెద్ద ఫెయిల్యూర్.
కాంగ్రెస్ ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తుందని కేసులు పెట్టించి నోటీసులు ఇప్పిస్తున్న బీజేపీ.. తాము కాంగ్రెస్ మేనిఫెస్టోను ఫేక్ చేశామని మాత్రం గుర్తించడం లేదు. కాంగ్రెస్ ఆస్తుల్ని లాగేసుకుని పంచేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఆ మాట ఎక్కడా పెట్టలేదు. అయితే లింక్ పెట్టుకుని ఆస్తుల్ని లాగేసుకుంటుందని ప్రచారం చేస్తున్నారు. ఇక మతపరమైన అంశాలనూ తెరపైకి తెస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు కానివ్వబోనని భీకరమన ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి తెలంగాణ సహా ఎక్కడా ముస్లిం రిజర్వేషన్లు అమల్లో లేవు. ముస్లింలలో కొన్ని వర్గాలకు కులాల ప్రకారమే రిజర్వేషన్లు ఇస్తున్నారు.
మూడో సారి బంపర్ మెజార్టీతో గెలవాలనుకుంటున్న మోదీ ప్రచారంలో దూకుడు స్థానంలో బేలతనం రావడం.. మొదటి రెండు విడతల్లో.. అనుకున్నంత హవా బీజేపీకి కనిపించడం లేదన్న విశ్లేషణలతో .. భారత ప్రజాస్వామ్యంలో ఏదో వండర్ జరగబోతోందన్న నమ్మకాన్ని అంతకంతకూ కొంతమంది పెంచుకుంటున్నారు.