మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే ఫోటోలు వచ్చాయి. ఇంతకీ జగన్ ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చారో తెలుసా ?. ఒక్క సారి అధికారం ఇవ్వండి ప్రతి ఇంట్లో నాన్న గారి ఫోటోతో పాటు నా ఫోటో కూడా పెట్టుకునేలా పరిపాలన చేస్తా అని. ఈ మాట .. పాదయాత్ర సమయంలో ప్రతీ చోటా చెప్పేవారు. ఆయన అంత గొప్పగా పరిపాలన చేసి.. అందరికీ మంచి చేసి..అభిమానంతో ఆ ఫోటోలు పెట్టుకునేలా చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే జగన్ కూ.., జనాల మధ్య ధింకింగ్లో తేడా వచ్చేది. జగన్ ఆలోచించేది వేరు. జనం ఆలోచించేది వేరు.
జగన్ ఇప్పుడు ప్రతీ ఇంట్లోనూ తన తో పాటు .. తన తండ్రి ఫోటోలను పంపుతున్నారు. ఆ ఫోటోలు కూడా ఎవరూ చించకుండా.. పడేయకుండా ఉండేలా గట్టి ప్లాన్ వేసుకున్నారు. ఇప్పుడు చచ్చినట్లుగా ప్రతి ఇంట్లోనూ జగన్ తో పాటు ఆయన తండ్రి ఫోటో ఉండాల్సిందే. మీ ఆస్తిపై మీకు హక్కు ఇస్తానంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం సర్వేలు ప్రారంభించి ఆస్తి పత్రాలిస్తున్నారు. వాటిలో వస్తున్న తప్పులు. తడకలుసంగతి పక్కన పెడితే.. ఆ ఆస్తిపత్రం పైన ఓ వైపు జగన్ బొమ్మ.. మరో వైపు వైసీపి జెండా తలపాగాలా చుట్టుకుంటున్న వైఎస్ బొమ్మ వేసి ఇస్తున్నారు.
అది కూడా గ్రాఫిక్కే . అసలు వైఎస్ ఉన్నప్పుడు వైసీపీ లేదు. ఆ రంగులు లేవు.. ఆ కండువా లేదు. అయినా అచ్చేసి ఇస్తున్నారు. ఈ పత్రాలు చూసి.. వైసీపీ ఫ్యాన్స్ కూడా.. మా ఆస్తులపై ఆ ఫోటోలెందుకని..అభిమానం ఉంటే గోడల మీద పెట్టుకుంటాం కదా అని బాధపడుతున్నారు. తాము కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు.. ప్రభుత్వం రాసిస్తున్నట్లుగా.. అప్పనంగా ఇస్తున్నట్లుగా తమ పత్రాలపై ఆ బొమ్మలేయడంపై అందరిలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ డాక్యుమెంట్లు చెల్లుతాయా.. అంటే.. చాన్సే లేదు. ఎందుకంటే.. దానికంటూ కొన్ని చట్టాలున్నాయి. అవి బొమ్మలుండటాన్ని అంగీకరించవు.