జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులకు, అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఈసీ హైకోర్టుకు తెలిపింది. స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణలో ఈసీ తరపు లాయర్ ఈ ఫార్ములాతో కోర్టుకు వచ్చారు. అయితే అన్ని చోట్లా గాజు గ్లాస్ గుర్తును జనసేనకు మాత్రమే పరిమితం చేయాలని.. ఆ పార్టీ పోటీ చేయకపోతే ఇతరులకు ఇవ్వకూడదని జనసేన తరపు లాయర్ కోరారు.
కానీ గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ లో ఉన్నందున కేటాయింపులు జరిగినందున… ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే మరో పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈసీ నిర్ణయం ప్రకారం కాకినాడ, రాజమండ్రి లోక్ సభ పరిధిలో అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థులకు ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తును ఉపసంహరిస్తారు. జగ్గంపేటలో జనసేన రెబల్ సూర్యచంద్రకు వచ్చిన గాజు గ్లాస్ గుర్తును తొలగించి వేరేది ఇస్తారు. ఇక ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకర్గాల పరిధిలో లోక్ సభ అభ్యర్థుల్లో ఇండిపెండెంట్లకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తుకును రద్దు చేస్తారు. అంటే.. దాదాపుగా లోక్ సభ ఎన్నికల్లో అతి కొద్ది మందికి మాత్రమే గాజు గ్లాస్ ఉంటుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం.. చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది. కూటమి నేతలు మూడు గుర్తులనురాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో గాజు గ్లాస్ ఉంది. ఇప్పుడు ఆ గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించారు. దీని వల్ల లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందన్న అంశాన్ని ఈసీ గుర్తించలేదు. బోలెడన్ని గుర్తులు అందుబాటులో ఉన్నా.. ఇలా చేయడంపై ప్రజాస్వామ్య వాదుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది.