ఏపీ అసెంబ్లీ లో బుధవారం వాడి వేడి చర్చలు జరిగాయి. గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మధ్యలో వైకాపా సభ్యులు రాజధాని భూబాగోతం గురించి రభస ప్రారంభించడంతో అంతా గందరగోళం అయిపోయింది. ఇలాంటి రభసల సమయంలో సాధారణంగా చోటుచేసుకునే అన్ని రకాల మలుపుల తర్వాత.. వైకాపా సభ్యుల సస్పెన్షన్ కూడా జరిగిపోయింది. తమాషా ఏంటంటే.. ఒక్క వైఎస్ జగన్ మినహా ఆ పార్టీకి చెందిన అందరు సభ్యుల మీద సస్పెన్షన్ వేటు పడింది. ఫైనల్‌గా.. జగన్ ఒక్కడూ మంచి బాలుడు.. ఆయన పార్టీలోని తతిమ్మా వాళ్లందరూ అల్లరోళ్లు అనే కలర్ వచ్చినట్లుగా పరిస్థితి తయారైంది.
చర్చ కాస్తా భూదందాల మీదికి మళ్లగానే తెలుగుదేశానికి చెందిన మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు బినామీ పేర్లతో వేలకోట్ల భూములు కొన్నారంటూ జగన్ ఆరోపించారు. సీబీఐ విచారణ చేయించాల్సిందే అంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులందరూ ఎలాంటి చర్చను ముందుకు సాగనివ్వకుండా తమ నినాదాలతో సభను హోరెత్తిస్తూ గడిపారు.
ఈ మధ్యలో జగన్ చేసిన ఆరోపణలను సభా ముఖంగా చేసినందున.. సభలోనే వాటికి సంబంధించిన ఆధారాలను చూపించి నిరూపించే వరకు సభా కార్యక్రమాలు ముందుకు సాగడానికి వీల్లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టుపట్టారు. సాక్షి దినపత్రికలో వారు ఎలా రాసుకున్నా పర్లేదని, బయట ఎలా మాట్లాడినా పర్లేదని, సభలో మంత్రుల అవినీతి గురించి ఆరోపణలు చేసిన తర్వాత.. వాటిని నిరూపించాల్సిన బాధ్యత ఉన్నదని తెదేపా నాయకులు వాదించారు. అయితే సీబీఐ విచారణకు ప్రభుత్వం భయపడుతోందని, సీబీఐ విచారణ మీద తనకు అనుమానాలు ఉన్నా.. పోన్లే అని కోరుతున్నా అంటూ జగన్ వాదించారు. సమయం గడచిపోతున్నప్పటికీ.. చర్చ మాత్రం ముందుకు సాగలేదు.
ఈ నేపథ్యంలో సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు రూల్‌బుక్ లోని 329వ నిబంధనను ప్రయోగించారు. చర్చ అదేపనిగా గాడితప్పిపోతున్నప్పుడు.. ఒక అంశం మీద చర్చ అనుకున్న దానికంటె చాలా ఎక్కువ సేపు సాగుతున్నప్పుడు.. ఆర్టికల్ 329ను ప్రయోగించడానికి వెసులుబాటు ఉన్నదంటూ.. దానిని ప్రయోగించి చర్చను (అర్థంతరంగా) ముగించాల్సిందిగా స్పీకరుకు సిఫారసు చేశారు. దాంతో స్పీకరు చర్చను ముగించేశారు. సభలోనే ఇది చాలా అరుదైన చర్య అని.. తన 34 ఏళ్ల జీవితంలో ఈ రూల్ ద్వారా చర్చను ముగించడం రెండోసారి చేయాల్సి వస్తోందని, ఇది ఆవేదన కలిగిస్తోందని.. ప్రతిపక్షం సభను సాగనివ్వడం లేదని యనమల అన్నారు.
ఆ తర్వాత కూడా వైకాపా సభ్యులు ఆందోళనలు, నిరసనలు, నినాదాలు తగ్గలేదు. దీంతో యనమల పార్టీ సభ్యులందరినీ సస్పెండ్ చేయడానికి సిఫారసు చేశారు. జగన్ మినహా సభలో ఉన్న వారినందరినీ బుధవారం సభాకార్యక్రమాలనుంచి సస్పెండ్ చేసేశారు. జగన్ ఒక్కడే మంచి బాలుడు లాగా సస్పెన్షన్‌ను తప్పించుకున్నారు.