ఇండియాలోనే నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వల్ల, నిర్మాతలకు తలనొప్పులు మొదలయ్యాయి. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు మేటర్ ఏమిటంటే..
ఇటీవల హైదరాబాద్ లో ‘రుస్లాన్’ అనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జరిగాయి. ఈవెంట్లో చిత్రబృందం, సెలబ్రెటీలూ ఉన్నారు కానీ, ఫ్యాన్స్ లేరు. వాళ్లు లేకపోతే మజా ఏం ఉంటుంది? అందుకనే అప్పటికప్పుడు ఈవెంట్ కంపెనీ, కృష్ణా నగర్ నుంచి వందమంది జూనియర్ ఆర్టిస్టుల్ని దిగుమతి చేయించింది. ఈవెంట్ కి వస్తే రూ.1000 ఇస్తామన్నది ఒప్పందం. దాంతో జూనియర్ ఆర్టిస్టులు హుషారుగా ఈవెంట్ కు వచ్చారు. కార్యక్రమం అయిపోయింది. కానీ పేమెంట్లు ఆగిపోయాయి. ఇస్తామన్న డబ్బులు ఏవి? అని అడిగితే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ చేతులు ఎత్తేసింది. నిర్మాతలకు అసలు ఈ విషయమే తెలీదు. దాంతో గొడవ మొదలైంది. ఇప్పుడు ఆ జూనియర్ ఆర్టిస్టులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తమకు రావాల్సిన మొత్తం ఇచ్చేలా చూడమని స్థానిక ఎస్.ఆర్.నగర్ పోలీసులకు మొర పెట్టుకొన్నారు. ఈవెంట్ కంపెనీతో పాటు, నిర్మాత కె.కె.రాధామోహన్ పైనా ఫిర్యాదు చేశారు. నిజానికి అసలు ఈ వ్యవహారం ఏమిటన్నది నిర్మాతకీ తెలీదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తీసుకొన్న ఓ తప్పుడు నిర్ణయం వల్ల నిర్మాతకు తలనొప్పులు మొదలయ్యాయి. రేపో, మాపో.. ఈ బాధితులంతా మీడియా ముందుకు వచ్చి, తమ గోడును వెల్లబుచ్చుకొంటారని సమాచారం. బడాస్టార్ ఈవెంట్లకు ఫ్యాన్స్‌ని సరఫరా చేయడం మామూలే. అయితే ఎక్కడా ఇలాంటి పేచీ జరగలేదు. ఇలాంటి ఓ ఇష్యూ బయటకు రావడం ఇదే తొలిసారి.