హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్ , నకిలీ వంశస్తులను సృష్టించి భూములను యధేచ్చగా అమ్మేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
దుర్గా ప్రసాద్ , సుబ్బారావు, రవి గౌడ్ ముగ్గురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని అమీన్ పూర్ పరిధిలోని ప్లాట్లను తప్పుడు పత్రాలను క్రియేట్ చేసి అమ్మేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ప్లాట్ లను గుర్తించి… ఆ భూమి ఎవరిది..? ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ అయిందని తెలుసుకొని నకిలీ యజమానిని సృష్టించి, నకిలీ యాజమాని పేరిట ఆధార్ కార్డు సృష్టించి ప్లాట్ లను అమ్మడం చేస్తున్నారు.
ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ఆధార్ కార్డులో పేర్కొన్న వయస్సు ఆధారంగా నకిలీ యాజమానిని సృష్టించి ఎంతోమందిని బురిడీ కొట్టించారు. నకిలీ యజమానులకు రెండు, మూడు వేల రూపాయలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేసేలా ఒప్పందం కుదుర్చుకొని గట్టిగానే ఈ ముఠా సంపాదించింది.
ప్లాట్ యజమానులు చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్లు తయారు చేసి 15 -20 ప్లాట్లకు వరకు అమ్మారని తెలుస్తోంది. వీటి విలువ 15కోట్లు ఉంటుందని వెల్లడించారు. అయితే, నకిలీపత్రాలను తయారు చేసి అమాయకుల ప్లాట్లను కాజేయడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
సీసీయస్ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. అక్రమ మార్గంలో ప్లాట్ల అమ్మకం వెనక ఈ ముఠాకు ఎవరైనా సహకారం అందించారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.