టీడీపీ, జనసేన నుంచి సీటు ఆశించి భంగపడి, వైకాపా గూటికి చేరినవాళ్లలో అలీ ఒకడు. కేవలం వైకాపా తనకు సీటు ఇస్తుందన్న కారణంతోనే స్నేహితుడైన పవన్ కల్యాణ్‌ని కూడా దూషించే సాహసానికి ఒడిగట్టాడు అలీ. అయితే అందుకు తగిన ప్రతిఫలం మాత్రం దక్కలేదు. ఏదో గౌరవ సలహాదారు పోస్టు ఇచ్చి, అలీని కాస్త బుజ్జగించే ప్రయత్నం చేసింది జగన్ పార్టీ. 2024 ఎన్నికల్లో అయినా తనకు తగిన గౌరవం ఇస్తారని, ఎం.ఎల్.ఏగా అసెంబ్లీకి పంపిస్తారని అలీ ఆశించాడు. కానీ.. ఈసారీ అలీకి మొండిచేయ్యే ఎదురైంది. దాంతో అలీ వైకాపాపై గుర్రుగా ఉన్నాడు. అసలు ఈ ఎన్నికలతో తనకు సంబంధమే లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. టాలీవుడ్ నుంచి వైకాపాకు నేరుగా మద్దతు ఇస్తోంది ఇద్దరే ఇద్దరు. ఒకరు అలీ, ఇంకొకరు పోసాని కృష్ణమురళి.
అలీ ది ఒక బాధైతే, పోసానిది మరో బాధ. వైకాపా గూటికి చేరి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, చిత్రసీమలో కొత్త శత్రువుల్ని సంపాదించుకొన్నాడు పోసాని. ఇప్పుడు ఆయనకు పెద్దగా సినిమా అవకాశాల్లేవు. వైకాపా టికెట్టూ ఇవ్వలేదు. పోసాని మాట్లాడిన ప్రతీ మాటా.. వైకాపాకు డామేజీగా మారుతోంది. అలీ వైకాపా తరపున ప్రచారం చేయడు. పోసాని చేసినా ఉపయోగం లేదు. అలీ తనకు ఇచ్చిన గౌరవ సలహాదారు పోస్టునీ పెద్దగా పట్టించుకోవడం లేదట. అసలు తనకు అలాంటి పోస్ట్ ఇచ్చినట్టే ప్రవర్తించడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం రాకపోతే, ఈ నామినేటెడ్ పదువులన్నీ తూచ్ అంటాయి. ఈలోగా ఈ పదవులపై ప్రేమ ఎందుకనో ఏమో.. అలీ పూర్తిగా లైట్ తీసుకొన్నాడు. ప్రచారంలోనూ కనిపించడం లేదు. ఎన్నికలు పూర్తయ్యాక ఆయన వైకాపా పార్టీకి గుడ్ బై చెబుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.