దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఎలాంటి ఆంక్షలు విధించని అధికారులు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే వారికి తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేర్చే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు కావడం ఆగ్రహం తెప్పిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి కాగజ్ నగర్ బయల్దేరుతుంది. మళ్లీ అదే ట్రైన్ తెల్లవారుజామున నాలుగుగంటలకు కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది.
ట్రైన్ కాకుండా బస్సులో కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తే ఆరు వందల వరకు ఖర్చు అవుతుంది. అదే ట్రైన్ లో వెళ్తే వందల రూపాయల లోపు 95 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో భాగ్యనగర్ ట్రైన్ రద్దుతో ఈ మార్గాల్లో రాకపోకలు కొనసాగించే ప్రయాణికులు రైల్వే అధికారుల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో వెళ్ళడం అంటే జేబులకు తూట్లు పొడుచుకోవడమేనని.. అంతేకాదు సమయం వృధా అవుతుందని పెదవి విరుస్తున్నారు.
భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు పెద్దపల్లి , రామగుండం, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్ నియోజకవర్గాల గుండా వెళ్తుంది. అయినా, ఈ ప్రాంతాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమాత్రం స్పందించడం లేదని మండిపడుతున్నారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలును పునరుద్దరించాలని కోరుతున్నారు.