దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితిలోనూ రద్దు చేయబోమని బీజేపీ స్పష్టం చేస్తోంది.
ఈ రెండు విషయాలపై జాతీయ పార్టీల మధ్య కొద్దిరోజులుగా డైలాగ్ వార్ నడుస్తుండగా..బీఆర్ఎస్ బాస్ మాత్రం ఈ అంశంపై నోరు మెదపడం లేదు. దీంతో కేసీఆర్ సైలెన్స్ పై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకు కేసీఆర్ మౌనం వహిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో ప్రతి అంశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్న కేసీఆర్.. రిజర్వేషన్ల అంశంపై మాత్రం మౌనంగా ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కవిత బెయిల్ కోసమే ఈ విషయంలో బీజేపీని కేసీఆర్ నిలదీయడం లేదా..? ఈ అంశంపై స్పందిస్తే అది కాంగ్రెస్ కు ఫేవర్ చేసినట్లు అవుతుందని నోరు మెదపడం లేదా..? అని చర్చ జరుగుతోంది.
ఇటీవలి కేసీఆర్ ప్రసంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్ల అంశమే లేదు. ఆయన హాయంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించడం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అయినా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నా కేసీఆర్ స్పందించకపోవడం చూస్తుంటే బిడ్డ బెయిల్ కోసం కాంప్రమైజ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై ఇప్పుడు ఏం మాట్లాడినా బీఆర్ఎస్ కు ఇబ్బంది అవుతుందని అంచనా వేసే కేసీఆర్ సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.