తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ కు ఎందుకు ఓట్లేయాలని కాంగ్రెస్ , బీజేపీలు ప్రశ్నిస్తుండటంతో తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సేనని జనాలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు కేసీఆర్. ఈమేరకు కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో కొనసాగదని చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని పడగొడతారని కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
కేసీఆర్ చెప్తునట్టుగా కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూల్చినా బీఆర్ఎస్ ఎలా అధికారంలోకి వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ను మరికొంతమంది ఎమ్మెల్యేలు వీడే అవకాశం ఉంది. వారంతా కాంగ్రెస్సో , బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయం. అయినా , కేసీఆర్ మాత్రం ఏ లెక్కన బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కేసీఆర్ చేస్తోన్న ఈ వ్యాఖ్యలు వ్యుహత్మకమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ అధికారంలోకి వస్తామని జనాలను నమ్మిస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తారని కేసీఆర్ నమ్ముతున్నట్టున్నారు.అందుకే ప్రచారంలో ఇదే అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. కానీ , కేసీఆర్ వ్యాఖ్యలను జనం ఎంతవరకు విశ్వసిస్తారు అనేది త్వరలోనే తేలనుంది.