ఎన్నికలకు ఎజెండా డిసైడ్ చేసే పార్టీకే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాంటి అజెండా డిసైడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ విషయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంటూ బీజేపీ ఎజెండా సెట్ చేయాలనుకుంది కానీ..రేవంత్ రెడ్డి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దు వరకూ తెచ్చేశారు. ఇప్పుడు అలా రద్దు చేయం అని చెప్పడానికి బీజేపీ తంటాలు పడుతోంది.
కానీ రేవంత్ దూకుడుగా అసలు ఆరెస్సెస్ విధానం రిజర్వేషన్ల రద్దేనని బలంగా వాదిస్తున్నారు. దానికి కౌంటర్ ఇవ్వలేక బీజేపీ తంటాలు పడుతోంది. కారణం ఏదైనా రేవంత్ రెడ్డి ఎన్నికల ఎజెండా రిజర్వేషన్ల రద్దు చుట్టూ తిప్పుతున్నారు. బీజేపీ దానికి వివరణలు ఇచ్చుకుంటూ పోతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పైచేయి కావడంతో… విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, సోషల్ మీడియా ప్రచారం అంతా తేలిపోతోంది.
రేవంత్ రెడ్డి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనూ డబుల్ డిజిట్ సాధిస్తే జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదుగుతారనడంలో సందేహం లేదు. ఆయన కాంగ్రెస్ చేరిన అనతికాలంలోనే సీఎం అయ్యారు. సీఎం అయిన కొద్ది రోజుల్లోనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విధివిధానాలు డిసైడ్ చేసేలా మారిపోయారు. జూన్ నాలుగు తర్వాత రేవంత్ ఎదుగుదల ఏ స్థాయిలో ఉంటుందో తేలుతుంది.