వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. అది అమలు చేయడం సాధ్యం కాదని చెప్పేందుకు మేనిఫెస్టోపై అదే పనిగా విశ్లేషణలు చేసే ఓ బృందం తన పని చేస్తూండగా.. కొత్తగా పేర్ని నాని వంటి అడ్డగోలు వాదకుల్ని రంగంలోకి దింపి కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు.
మేనిఫెస్టోపై మోదీ బొమ్మ లేదని.. అమలు చేయలేని హమీలు ఇచ్చినందుకు మోదీ వద్దన్నారని జగన్ ప్రచారం చేస్తున్నారు. దానికి కొనసాగింపుగా పేర్ని నాని కూడా ప్రెస్మీట్లు పెట్టి చెబుతున్నారు. అయితే మోదీ బొమ్మ లేదు అని ప్రచారం చేయడం… ఎవరికి ప్లస్సో వైసీపీ నేతలు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే టీడీపీ ఇచ్చే పత్రికా ప్రకటనల్లో పవన్ బొమ్మ లేదంటూ పేర్ని మరో విచిత్రం పట్టుకొచ్చారు. కూటమి తరపున కాకుండా టీడీపీ ఇచ్చే ప్రకటనల్లో చంద్రబాబు బొమ్మే ఉంటుంది. అయినా లోగో ఉంటుంది. ఇలాంటి సిల్లీ విషయాలను పట్టుకొచ్చి రాజకీయం చేయాలని పేర్ని నానికి ఎవరు చెబుతున్నారో కానీ.. ఆయన పరువు పోతోంది.
కారణం ఏదైనా.. రాజకీయాల్లో ఏది మట్లాడుకుంటున్నారన్నది కాదు.. మాట్లాడుకుంటున్నారా లేదా అన్నదే ముఖ్యం. ఈ లెక్కన టీడీపీ మేనిఫెస్టోపై టీడీపీ ప్రచారం చేస్తోంది. వైసీపీ కూడా ప్రచారం చేస్తోంది. అన్ని పార్టీలు సంయుక్తంగా టీడీపీ మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకెళ్తున్నాయి. అసలు వైసీపీకి మేనిఫెస్టో ఉందని కూడా వైసీపీ నేతలు మర్చిపోయే పరిస్థితి రావడమే అసలు విషాదం.