ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జట్టు దూరమైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఈసారి కనీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హత సాధించలేకపోవడం ముంబై ఇండియన్స్ అభిమానులు జీర్ణించుకోలేని విషయం. మైదానంలో జట్టు ఆట తీరు వాళ్లని బాగా ఇబ్బంది పెట్టింది. దానికంటే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరు వాళ్లని మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. ఆటగాడిగా, కెప్టెన్‌గా హార్దిక్ వైఫల్యం.. ముంబై దీన స్థితికి ప్రధాన కారణం. కెప్టెన్ అయిపోయానన్న అహంకారంతో హార్దిక్ ప్రవర్తించిన తీరు కూడా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ శర్మతో పాండ్యా ప్రవర్తించిన తీరు మరింత షాకింగ్ కి గురి చేస్తోంది. తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ మోహరింపులో భాగంగా రోహిత్ ని అటూ, ఇటు పరిగెత్తించిన తీరు అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో సొంత మైదానంలో, సొంత అభిమానులే పాండ్యాని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచో ఏదో ఓ రూపంలో పాండ్యాని అభిమానులు కార్నర్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా రోహిత్ శర్మని మైదానంలో దించకుండా ఇంపాక్ట్ సబ్ గా పెవీలియన్లోనే కూర్చోబెట్టేశాడు పాండ్యా. కొలకొత్తాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రంగంలోకి దిగాడు. నిజానికి ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరినైనా వాడుకోవొచ్చు. మొన్నటి వరకూ సూర్య కుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్ బాధ్యతలు పోషించాడు. ఇప్పుడు రోహిత్ ఆ స్థానాన్ని తీసుకొన్నాడు. రోహిత్ లాంటి ఆటగాడు మైదానంలో ఉంటే ఆ జోష్ వేరు. పైగా కెప్టెన్ గా జట్టుని నడిపించిన అనుభవం తనకు ఉంది. విలువైన సలహాలు ఇవ్వగలడు. మరీ అంత గొప్ప ఫీల్డర్ కాదు కానీ, క్యాచ్‌లు బాగా పడతాడు. ముఖ్యంగా స్లిప్‌లో. అలాంటి ఆటగాడ్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా మార్చి పెవీలియన్‌కే పరిమితం చేయడం ఫ్యాన్స్ కు మరింత కోపం తెప్పించింది. రోహిత్ మైదానంలో ఉంటే తోటి ఆటగాళ్లు తన మాట వినడం లేదని, మైదానంలో రోహిత్ నే కెప్టెన్ గా భావిస్తున్నారని పాండ్యా భావించి ఉంటాడు. అందుకే రోహిత్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా మార్చేశాడు. ఈ తెలివి తేటలేవో.. ఆటని మెరుగు పర్చుకోవడంలో ఉండి ఉంటే, ముంబై ఇంత దీనమైన స్థితిలో ఉండేది కాదు. ఐపీఎల్ అయిపోతోంది. వరల్డ్ కప్ వస్తోంది. అక్కడ రోహిత్ శర్మ సారథ్యంలో పాండ్యా ఆడాల్సివుంది. అది పాండ్యా గుర్తిస్తే మంచిది.