జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ అద్దం పంపుతున్నట్లుగా ప్రకటించారు. ఆ అద్దాన్ని ప్రదర్శించారు. తాను అద్దం పంపుతున్నానని .. ఆ అద్దంలో చూసుకోవాలని.. అద్దంలో మీకు మీరు కనిపిస్తున్నారా ? చంద్రబాబు కనిపిస్తున్నారా ? అనేది పరిశీలించుకోవాలని సలహా ఇచ్చారు. షర్మిల ఇంత తీవ్రంగా స్పందించడం వెనుక బలమైన కారణం ఉంది.
జగన్మోహన్ రెడ్డి తనకు ఇష్టం లేని ప్రతి విషయంపైనా చంద్రబాబు ముద్ర వేస్తూంటారు. తన కోసం పని చేసిన చెల్లిని ఆయన వదిలించుకున్నారు. ఆమె సొంత రాజకీయం చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తున్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. తనకు నష్టం కలిగించే ప్రతీ విషయం ఎలా చంద్రబాబుపై తోసేస్తారో.. షర్మిలపైనా అదే ప్రయోగం చేశారు. సొంత చెల్లి అనే భావన కూడా వ్యక్తిత్వంపైనా విమర్శలు చేస్తున్నారు. జాతీయ మీడియా ఇంటర్యూలతో పాటు ప్రచార సభల్లోనూ అదే చెబుతున్నారు.
టీడీపీ నేతలకు.. వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డి చేసే చంద్రబాబు భజన గురించి అవగాహన ఉంది. ఆయన ఇప్పుడు ప్రచారసభల్లో ఒక్క సారి కూడా వైఎస్ ను తల్చుకోవడం లేదు. కానీ చంద్రబాబును ప్రతి ప్రసంగంలోనూ కనీసం వంద సార్లు గుర్తు చేసుకుంటారు. ఆయన ప్రచారం అంతా చంద్రబాబు చుట్టూనే తిరుగుతుంది. చివరికి కుటుంబసభ్యుల్ని కూడా .. ఆయనకే అంటగడుతూండటంతో షర్మిల తీవ్రంగా స్పందించాల్సి వస్తోంది. అయినా ఇలాంటివి జగన్ పట్టించుకోలేరు. అద్దంలో చూసుకుని పక్కన పడేసి.. మళ్లీ అవే విమర్శలు చేస్తారని వైసీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.