అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నట్టు లేదు.. ఓడిపోవడానికి చేస్తున్న ప్రయత్నంలా ఉందంటూ దానం వైఖరిపై ఆ పార్టీలోని నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దానం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్థానిక పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ప్రచార ఫ్లెక్సీలో ప్రోటోకాల్ పాటించడం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో ఉండటంతో అందుకు సంబంధించిన ఫ్లెక్సీ వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఇందులో మేయర్ , డిప్యూటీ మేయర్ ఫొటోస్ మిస్ అయ్యాయి. దీంతో మేయర్ పేరుతో ఉన్న నెంబర్ నుంచి .. మీ ఫ్లెక్సీలో మేయర్, డిప్యూటీ మేయర్ ఫోటోలు తరుచుగా మిస్ అవుతున్నాయి. ఇంతకీ మేము పార్టీలో ఉన్నామా..? అంటూ దానంను ప్రశ్నించారు.
వెంటనే ఈ గ్రూప్ అడ్మిన్ మెసేజ్ డిలీట్ చేసినా అంతకుముందే మరో వ్యక్తి స్క్రీన్ షాట్ తీయడంతో అది ఇతర గ్రూప్ లో పోస్ట్ చేయడంతో దానంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దానం కాంగ్రెస్ నేతలను సమన్వయము చేసుకోవడంలో ఘోరంగా విఫలం అవుతున్నారని అందుకు తాజా పరిణామమే నిదర్శనమని ఉదాహరిస్తున్నారు. దానం అభ్యర్తిత్వమే సికింద్రాబాద్ లో కాంగ్రెస్ కు పెద్ద మైనస్ కాగా ఆయన ఒంటెత్తు పోకడ ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రంలా మారుతుందనే టాక్ నడుస్తోంది.
నిజానికి దానం ఎంపీగా పోటీ చేసేందుకు మొదట నిరాకరించారని, అధిష్టానం ఒత్తిళ్ళతో అంగీకరించారనే ప్రచారం నేపథ్యంలో ఆయన వైఖరిపై పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.