ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఈవోకు ఈ ఫిర్యాదు ఇవ్వగానే ఆయన … సీఐడీలోని ఓ ప్రత్యేకమైన అధికారిని దర్యాప్తు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ సీఈవో ఆదేశాలు చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. ఆయనకు టీడీపీ వాళ్లు కనీసం ఆరు వందల ఫిర్యాదులు ఇచ్చారు. అందులో మహిళల్ని ఘోరంగా అవమానిస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తున్న ఫిర్యాదులు ఉన్నాయి. ఏవీ పట్టించుకోలేదు. కానీ వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ లో చెబితే మాత్రం తప్పుడు ప్రచారం .. విచారణ చేయాలని ఆదేశించేశారు. అదీ కూడా సీఐడీకి.
ఏపీలో ఎన్నికల సంఘం ఉందా లేదా అన్నట్లుగా పరిణామాలు జరుగుతున్నాయి. అభ్యర్థులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అసలు వ్యవస్థలు ఉన్నాయా.. వైసీపీ నేతలు ఎన్నికలు నిర్వహిస్తున్నారా అన్నట్లుగా మారిపోయింది. చివరికి పోస్టల్ బ్యాలెట్ల విషయంలోనూ గందరగోళం రేపుతున్నారు కానీ ప్రక్రియ సాఫీగా సాగేలా చేయడం లేదు. వ్యవస్థ ఇంత దారుణంగా పెట్టుకుని అధికార పార్టీ రాజకీయ స్వార్థానికి పని చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇవ్వడం సామాన్య ప్రజల్ని సైతం బిత్తరపోయేలా చేస్తోంది.
ఏపీ ల్యండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అందులో ఉన్న నిజమేంటో.. అబద్దమేంటో అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇందులో తప్పుడు ప్రచారమేంటో.. నిజమైన ప్రచారమేంటో వైసీపీనే అడగాల్సింది డిప్యూటీ సీఈవో. కానీ ఆయన టార్గెటెడ్ గా సీఐడీలో ఫలానా అధికారి విచారణ కావాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇలాంటి వారితో ఎన్నికలు నిర్వహిస్తే.. ఎంత గొప్పగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ వ్యవస్థల్ని ఎప్పుడో చెరబట్టేశారు. నిజాయితీని ఆశించే పరిస్థితి లేకుండా పోయింది.