ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బుతో ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. వైసీపీ, తెలుగుదేశం అభ్యర్ధులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. మొన్నటివరకూ వైసీపీలోనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. గెలుపు కోసం కుస్తీలు పడుతున్నారు. భాస్కరరెడ్డి తిరుపతి జిల్లా నుండి వలస వచ్చారని.. డబ్బులతో ఒంగోలు ప్రజల్ని కొనేద్దామని ఆశ పడుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
చెవిరెడ్డి అడుగు పెట్టినప్పటి నుండి తాయిలాల రాజకీయం
చెవిరెడ్డిని వైసీపీ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి తాయిలాల రాజకీయం ప్రారంభించారు. ఆ తాయిలాలు భోజనాల దగ్గర్నుంచి ప్రారంభమయ్యాయి. మందుగా చెవిరెడ్డి మండల కేంద్రాల్లో పరిచయ వేదికల పేరుతో భారీగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రచారం కన్నా ఇలా తాయిలాల ద్వారా చేసే రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. వాలంటీర్ల దగ్గర నుంచి మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని వైసీపీ కౌన్సిలర్లు, ఇన్చార్జిలకు.. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ డివిజన్ అధ్యక్షులకు వారి రేంజ్ ను బట్టి డబ్బులు పంపుతున్నారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరిలో ఒక్కొక్కరికి లక్ష పంపిణీ చేశారు. ఒంగోలులో ఒక్కో కార్పొరేటర్‌కు 3 లక్షల ప్రకారం ఇచ్చారు. డివిజన్ వైసీపీ అధ్యక్షులకు కూడా డబ్బులు ఇచ్చారు. ఇలా సొంత క్యాడర్ కు పంపకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక తన తరపున వాళ్లే చూసుకుంటారన్నట్లుగా ధీమాగా ఉన్నారు.
ఆశలు పెంచేసుకున్న వైసీపీ నేతలతో మొదటికే మోసం
చెవిరెడ్డి భారీగా డబ్బులిస్తున్నారని ప్రచారం జరగడంతో కార్యకర్తలు సహా అందరూ ఆశలు పెంచేసుకున్నరు. ఒంగోలు కార్పొరేటర్లకు మూడు లక్షలు ఇచ్చి.. ఇతర చోట్ల లక్ష చొప్పున ఇవ్వడంపై వారంతా మండిపడుతున్నారు. తమకూ మూడు లక్షలివ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. వలంటీర్లకు రెండు నెలల నుంచి చెవిరెడ్డి డబ్బులు పంపిస్తున్నారు. ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున మొదటి నెలలో డబ్బులతో పాటు గిప్టులు కూడా ఇచ్చారు. ఇప్పుడు గిఫ్టులు ఆపేసి డబ్బులు ఇస్తున్నారు. ఎంత పిండుకుంటే అంత వస్తుందన్న ఆలోచనతో వాలంటీర్లు తమదైన రీతిలో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. కొంత మంది ఇతరులకు బాగా ఇచ్చారని తమకు ఇవ్వలేదని ఆగ్రహానికి గురవుతున్నారు.
అంతా చంద్రగిరి నుంచి వచ్చిన మనుషుల హవానే
డబ్బులు ఇచ్చినా లోకల్ లీడర్లను చెవిరెడ్డి నమ్మడం లేదు. చెవిరెడ్డి పొదిలి కేంద్రంగా వ్యవహారం నడిపిస్తున్నారు. పొదిలి కేంద్రంగా ఆయన సుమారు 80 మంది సొంత వ్యక్తులను ఉంచి. వారిని రోజువారీ ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలకు పంపుతున్నారు. వారే అన్నీ చూసుకుంటున్నారు. . కొన్నిచోట్ల చెవిరెడ్డి టీం సభ్యులే కిందిస్థాయి నాయకులకు ఫోన్లు చేసి ఏం సరిగ్గా పనిచేయడం లేదని హెచ్చరిస్తున్నారు. దీంతో కిందిస్థాయిలోని వైసీపీ నాయకులు ఈ పరాయి పెత్తనం ఏంటని ఫైర్ అవుతున్నారు. చెవిరెడ్డికి కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయని చెబుతారు. వాటిలోని వారితో ఒంగోలు లోక్ సభలో హడావుడి చేస్తున్నారు. వారు చేస్తున్న అతితో మొదటికే మోసం వస్తోంది.
వైసీపీ క్యాడర్ తోనూ టచ్ లో మాగుంట
ఒంగోలు టీడీపీ ఎంపి అభ్యర్ధిగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇటు ఒంగోలులో ఒక ఆఫీసు, అటు మార్కాపురంలో ఒక ఆఫీసు ఏర్పాటు చెసుకుని అందరికీ అందుబాటులో ఉంటున్నారు. అవి ఎన్నికలకోసం పెట్టిన ఆఫీసులు కావు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఉన్నాయి. వైసీపీ నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పెద్దగా చెవిరెడ్డి అందుబాటులో ఉండకపోవడంతో వైసీపీ నేతలు మాగుంటతో టచ్ లోకి వెళ్లిపోయారు. చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అఫిషియల్‌గా ఎక్కడా ఎలక్షన్ ఆఫీసు ప్రారంభించలేదు. దాంతో చెవిరెడ్డిని కలవటానికి సామన్య కార్యకర్తలు ఇక్కట్లు పడాల్సి వస్తుంది. ఆయన ఎక్కువగా తన వారసుడు మోహిత్ రెడ్డి పోటీలో ఉన్నచంద్రగిరిపైనే దృష్టి పెడుతున్నారు. మొత్తం పంపకాలతో పనైపోతుందన్నట్లు చెవిరెడ్డి తన టీంతో ఆ తతంగం నడిపిస్తూ ప్రచారంలో పెద్దగా కనిపించకపోతుండటం పెద్ద మైనస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.