ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక బస్సు యాత్ర పేరుతో టీవీ షో నిర్వహించారు. ప్రజల్ని ఎవర్నీ కలవకపోగా… అది రియాల్టీ షోగా మిగిలిపోయింది. అందులో గులకరాయి డ్రామా మరో విఫల ఎపిసోడ్. పోనీ నియోజకవర్గ సభల్ని అయినా వేగంగా నిర్వహిస్తారా అంటే.. అసలు పూర్తిగా ఆశలు వదిలేసుకుని మ .. మ అన్నట్లుగా నిర్వహిస్తారు.
బస్సు యాత్ర ఐపోగానే జగన్ వంద ప్రచార సభల్లో పాల్గొంటారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ పట్టుమని నలభై నియోజకవర్గాల్లోనూ సభలు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తు మార్పుల కోసం మూడు రోజుల కిందట ప్రచారానికి సెలవు ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఆదివారం మరోసారి హాలీడే తీసుకున్నారు. ఆయన ఆదివారం ప్రచారంలో పాల్గొనడంలేదు. సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ప్రచారానికి గడువు. శనివారం సాయత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగిసిపోతుంది. అంటే ఇంకా మహా అయితే ఓ పదిహేను నియోజకవర్గాల్లో మాత్రమే పర్యటించగలరు. ఇప్పటి వరకూ ఓ ఇరవై నియోజకవర్గాల్లో సభలు పెట్టారు.
ఓ ముఖ్యమంత్రి పార్టీ విజయం కోసం ఇంత పేలవంగా ప్రచారం చేయడం ఇప్పటి వరకూ ఎక్కడా లేదు. పోనీ ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారా.. అంటే అలీ లాంటి వాళ్లు కూడా రావడం లేదు. అసలు స్టార్ క్యాంపెయినర్లు అనే జాబితాను ఈసీకి ఇవ్వడానికి వారి వద్ద పేర్లు లేవు. మీడియాలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డిని రోడ్డు మీదకు వెళ్తే ఎవరూ పట్టించుకోలేరు. తల్లీ, చెల్లి లేరు. చెల్లి కాంగ్రెస్ లో చేరి జగన్ మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా వైసీపీ పరిస్థితి బాగో లేదని.. ఘోరంగా ఓడిపోవడం ఖాయమని అర్థం కావడంతో జగన్ నిరాసక్తంగా ఉంటున్నారు. ప్రచారానికి సరిగ్గా వెళ్లడం లేదని వైసీపీ నేతలకు క్లారిటీ వస్తోంది.