పైకి గయ్యాళిలా కనిపించే సూర్యకాంతం. మనసు వెన్నపూస. ఆమెతో పని చేసినవాళ్లంతా ఇదే మాట ముక్తకంఠంతో చెబుతారు. తిట్లూ, శాపనార్థాలకు పేటెంట్ హక్కులు తీసుకొన్నట్టున్న సూరేకాంతం.. బయట చాలా చమత్కారంగా మాట్లాడేవారు. అందుకు ఇదో ఓ ఉదాహరణ.
అవి ‘శ్రీమంతుడు’ (1971) సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు. ఏఎఎన్నార్ హీరో. ప్రత్యగాత్మ దర్శకుడు. సూర్యకాంతం, రమణారెడ్డిలపై ఓ సీన్ తీస్తున్నారు. అప్పటికే సూర్యకాంతంకు డైలాగ్ పేపర్ ఇచ్చేశారు. ఓసారి రివిజన్ చేసుకొని.. ‘రెడీ’ అన్నారామె. సీన్ మొదలైంది. రమణారెడ్డిని ఓ రేంజ్లో తిట్లూ, శాపనార్థాలతో ముంచెత్తేస్తున్నారు సూర్యకాంతం. ఆ ధాటికి… సెట్ అంతా డంగైపోయింది. ఆఖరికి ప్రత్యగాత్మ కూడా సీన్ అయిపోయినా ‘కట్’ చెప్పకుండా ఆగిపోయారు. అది గమనించిన సూర్యకాంతం.. సీన్ లో డైలాగులన్నీ అయిపోయినా సరే.. దర్శకుడు కట్ చెప్పలేదు కదా, అని సీన్‌ని మరింత ఓన్ చేసేసుకొని, అప్పటికప్పుడు మనసులోనే డైలాగులు అల్లేసుకొని.. ఆ సీన్ అలా కొనసాగించించారు. చివరాఖరికి ఎప్పుడో ప్రత్యగాత్మ తేరుకొని ‘కట్’ చెప్పారు. సెట్ అంతా ఎప్పటిలా చప్పట్లతో మార్మోగిపోయింది.
‘అదేంటి డైరెక్టరు గారూ.. ‘కట్’ చెప్పలేదేం?’ అని సూర్యకాంతం అడిగితే.. ‘బాగుంది కదమ్మా.. నీ ధాటి, అలాగే కొనసాగితే ఇంకా బాగుంటుందని ఊరుకొన్నా’ అన్నారు. ‘మీకు బాగోవడం నాకు మరింత బాగుంది. కానీ ఆ ఎగస్ట్రా డైలాగులకు కూడా రచయితగా నాకు పారితోషికం ఇప్పిస్తే ఇంకా బాగుంటుంది’ అన్నారు అప్పటికప్పుడు ఛలోక్తిగా. దాంతో సెట్ అంతా మరోసారి ఘొల్లుమంది. ఇలా సీన్‌ని ఓన్ చేసుకొని, తనదైన నటనా పటిమతో రక్తికట్టించిన సందర్భాలు కోకొల్లలు.