ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే… ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు తప్పుతున్న సూచనలు కనిపిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో బదిీల వేటు వేశారు. సీఎం రమేష్ మీద దాడి జరగిన తర్వాత వేటు పడింది. అంతకు ముందు ఎన్ని అరాచకాలు జరిగినా శాంతిభద్రతలు తేడావచ్చినా ఈసీలో కదలిక రాలేదు.
రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. డీజీపీ స్థానం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారని విమర్శలు ఉన్నాయి. అంతా గమనించేలా ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా ఏ రోజూ పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. పైగా ఆయనకు డీజీపీ అయ్యే అర్హత లేదు. ఆయన ఇంచార్జ్ డీజీపీగానే ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీ మంత్రుల్ని, వైసీపీ నేతల్ని ప్రశ్నించేవారిని అణగదొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని అపవాదు ఎదుర్కొంటున్నారు.
వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారితో పాటు సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని టీడీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తూ వస్తోంది. అయితే అసలు డీజీపీ నిమిత్తమాత్రుడని మొత్తం సజ్జల అనధికారిక డీజీపీగా వ్యవహరిస్తారని అంటున్నారు. కొత్తగా వచ్చే డీజీపీ సీరియస్ గా వ్యవహరిస్తే.. పోలీసుల పనితీరులో మార్పు వస్తుంది.
మరో వైపు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికూడా జగన్ కనుసన్నల్లో పని చేస్తూ వృద్ధుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇంకా నిర్ణయం తీసుకోలేదు.