లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సోమవారం తీర్పు వెలువరించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో తనను ఈడీ, సీబీఐలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్ లు దాఖలు చేశారు. వీటిపై వాదనలు ముగియడంతో సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు వెలువరించనున్నారు.
లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐలు కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలోనే తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. కవిత మహిళా కనుక పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు కవిత అర్హురాలు ఆమె తరఫు న్యాయవాది వాదించారు. కవిత అక్రమాలకు పాల్పడినట్లు అప్రూవర్ల స్టేట్ మెంట్లు తప్ప ఆధారాలు లేవన్నారు. అయితే, కవితకు బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేస్తారని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు.
ఉదయం 10గంటలకు ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును స్పెషల్ కోర్టు జడ్జి వెలువరించనున్నారు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా..?అని బీఆర్ఎస్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. లిక్కర్ కేసు నుంచి కవితకు బెయిల్ వస్తే ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభించనుంది.బెయిల్ నిరాకరిస్తే మాత్రం కవితను కోర్టులో హాజరు పరచనున్నారు.