అధికార పార్టీ నేతగా.. సీఎంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ప్రచారసభల్లో ఏం చెబుతున్నారు ?. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెబుతున్నారా ?. తన మేనిఫెస్టో గురించి చెబుతున్నారా ? అంటే.. ఏదేమీ లేదు.. ఆయన చేస్తున్నదంతా చంద్రబాబును తిట్టడం.. ఆయనొస్తే పథకాలు ఆగిపోతాయని బెదిరించడమే. మధ్యలో టీడీపీ మేనిఫెస్టో అమలు చేయలేరని దీర్ఘాలు తీయడం. జగన్ ప్రచార స్ట్రాటజీ ఇంతగా చంద్రబాబుపై ఆధారపడటం వైసీపీ నేతల్ని కూడా నివ్వెర పరుస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిపై దుమ్మెత్తి పోసి ఆయన అది చేశాడు.. ఇది చేశాడు అని ప్రచారం చేయడం ఎవరైనా చేస్తారు. కానీ ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతిపక్ష నేతపై దుమ్మెత్తి పోస్తూ చేసే ప్రచారాన్ని జగన్ మార్క్ అంటారు. ఐదేళ్లలో తాను చేసిన పనుల గురించి చెప్పులేకపోతున్నారు. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెప్పడం లేదు. కనీసం తన మేనిఫెస్టోలో పెట్టిన విషయాలపైనా ఆయన ప్రచారం చేసుకోలేకపోతున్నారు. అన్ని పథకాలకు రెట్టింపు డబ్బులు ఇస్తానని చెప్పారు. నిజంగా రెట్టింపు ఇస్తారా.. లేకపోతే ఇప్పటి వరకూ ఇచ్చిన డబ్బులతో కలిసి ఆ లెక్కలు చెప్పారా అన్నదానిపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పాలి కదా !
తన ప్రసంగాల్లో చంద్రబాబును నమ్మోద్దు.. ఆయన చంద్రముఖి అని చెప్పడం తప్ప.. తనను ఎందుకు నమ్మారో చెప్పలేకపోతున్నారు. ఐదేళ్లలో అన్ని వర్గాలను అడ్డగోలుగా మోసం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఆయన చెప్పే సమాధానం లేదు. మోసంచేయకపోతే మేలు చేస్తే అదే చెప్పాలి కదా. బ టన్లు నొక్కాను.. ఖాతాల్లో డబ్బులు పడినాయని చెప్పుకోవడం తప్ప చేసిదేమీ లేదు. ఆ డబ్బులన్నీ తమ దగ్గర రెట్టింపు వసూలు చేశారని ప్రజలే ఎదురు లెక్కలు చెబుతున్నారు.
జగన్ ప్రచార స్ట్రాటజీ ప్రతిపక్ష నేత తరహాలోనే ఉందన్న విమర్శలు మొదటి నుంచి వచ్చాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయినా ఆయన అదే పద్దతిలో ప్రచారం చేసుకుంటూ పోతున్నారు.