కడప లోక్ సభ బరిలో ” ఎలగైనా అవినాష్ రెడ్డే గెలుస్తారు ” అని వైసీపీ నేతలు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఎలాగైనా అనే పదం వాడతూ వ్యక్తం చేస్తున్న ధైర్యంలోనే వారి ఆందోళన బయట పడుతోంది. కడపలో సానుభూతి అస్త్రంతో మెజార్టీ సాధించుకుంటూ వస్తున్న జగన్ కు ఈ సారి సానుభూతి పవనాలు ఏమైనా ఉంటే అవి షర్మిల, సునీత వైపు ఉండే అవకాశాలు ఉన్నాయి. కడపలో అవినాష్ రెడ్డి ఓడిపోతే జగన్ ఓడిపోయినట్లే. మరో వైపు టీడీపీ అభ్యర్థి కూడా సీరియస్ గాప్రయత్నం చేస్తున్నారు. అసలు వైఎస్ కుటుంబ పెత్తనం ఏంటి.. తరిమేద్దాం అన్న ఆలోచనలు చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
సొంత పార్టీ నేతలకూ డబ్బులు పంచుకోవాల్సిన దుస్థితిలో వైసీపీ
కడప లోక్ సభలో తొలి సారి త్రిముఖ పోరు జరుగుతోంది. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. వైసీపీకి పార్టీ బలం, పటిష్టమైన కేడర్ తోడ్పాటు ఉన్నాయి. కానీ వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డిని చూస్తే తడిగుడ్డతో గొంతు కోసి సాత్వికుడిగా నటించే రాజకీయ నేత అన్నట్లుగా ప్రజలు అభిప్రాయానికి రావడం సమస్యగా మారింది. ఇక సొంతపార్టీ క్యాడర్ కు ఐదేళ్లలో ఏం లాభం జరగలేదు. దీంతో అందరికీ డబ్బులు పంచారు. కానీ వారంతా మనస్ఫూర్తిగా పని చేస్తారో లేదో స్పష్టత రాలేదు. పులివెందుల నియోజకవర్గంలో పాస్ బుక్కులపై జగన్ బొమ్మపై రైతుల్లో అభ్యంతరాలు వ్యక్తం కావడం పెను సంచలనంగా మారింది. ఎదురు అడిగే ధైర్య రావడమే అసలైన మార్పునకు కారణంగా చూపిస్తున్నారు.
కొంగు సెంటిమెంట్ తో షర్మిల రాజకీయం
వైఎస్ వివేకా చివరి కోరిక షర్మిల ను లోక్ సభకు పంపడమని .. అలా డిమాండ్ చేసినందుకే ఆయనను చంపేశారని క్లారిటీకి రావడంతో న్యాయం కోసం ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బ రిలోకి దిగారు. సునీత , షర్మిల ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్ ఇంటి ఆడబిడ్డలు న్యాయం కోసంవచ్చామని కొంగు చాపి అర్థిస్తున్నామని ఓట్లు వేయాలని కోరుతున్నారు. వీరి విజ్ఞప్తులకు మహిళలకు ఎక్కువగా ప్రభావం అవుతున్నారు. ప్రచారంలో లోటు రానీయడం లేదు.
వైఎస్ కుటుంబాన్ని వదిలించుకుందామని చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి ప్రచారం
టీడీపీ తరపున బరిలోకి నిలబడిన చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి వైఎస్ కుటుంబంలో అక్రమాస్తుల కోసం ఏర్పడిన వివాదంలోనే ఇద్దరూ పోటీ చేస్తున్నారని ఇంకా ఎదుకు భరించాలని ప్రశ్నిస్తూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి పార్టీ బలం, యువత మీద ఆశలు పెట్టుకున్నాయి.
ఐదేళ్లలలో చేసిందేమీ లేదు – చంద్రబాబు వస్తే పథకాలు ఆగిపోతాయని ప్రచారం !
కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్ నియోజకవర్గాలున్నాయి. వైసిపి అభ్యర్థి వైఎస్.అవినాష్‌రెడ్డి తరపున ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రచారం చేశారు. అవినాష్ సతీమణి విస్తృత ప్రచారం గావిస్తున్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రచారంలో ప్రధానాంశంగా చెపుతున్నారు. 2017లో ప్రతిపక్ష నాయకుని హోదాలోనూ, ఆ తరువాత ముఖ్యమంత్రి హోదాలోనూ వైఎస్ జగన్…జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలైన జమ్మలమడుగులో మూడేళ్లలోనే ఉక్కు పరిశ్రమ నిర్మాణం, చెన్నూరు చక్కెర పరిశ్రమ, రాజోలి జలాశయం నిర్మాణం, జిఎన్ఎస్ఎస్ ఫేజ్-2లో పనుల్ని చేపట్టకపోవడాన్ని ప్రజలు ప్రస్తావిస్తున్నారు.
టీడీపీలోకి పలువులు నేతల చిరేకలు
టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డికు మద్దతుగా ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. భూపేష్‌రెడ్డికి మద్దతుగా చిన్నాన్న మాజీమంత్రి సి.ఆదినారాయణరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కడప అభ్యర్థి ఆర్.మాధవి సహా ఇతర కుటుంబసభ్యులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ నుండి కొంతమంది చేరారు. దీనికి ధీటుగా మైదుకూరులో జగన్ సిద్ధం సభను ఏర్పాటుచేయించారు. కౌంటర్‌గా మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ చాపాడు, బ్రహ్మంగారిమఠం మండలాల్లో చేరికల వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.. మైదుకూరు, జమ్మలమడుగు స్థానాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. షర్మిల పోలింగ్ వరకు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనుండడంతో వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది.
కడప పోరు గతంలోలా ఏకపక్షంగా ఉండే అవకాశం లేదు. ఫలితం సంచనం సృష్టించినా ఆశ్చర్యపోనక్కరలేదు.