మే 13న ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎలక్షన్ ఫీవర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వసూళ్లపై తీవ్రంగా కనిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా వాటికి వసూళ్లు దక్కడం లేదు. గత వారం కూడా 3 చిత్రాలు విడుదలయ్యాయి. కానీ ఫలితం శూన్యం. ఎన్నికలకు సరిగ్గా మూడు రోజులకు ముందు కూడా కొత్త చిత్రాల హంగామా కనిపించబోతోంది. టాలీవుడ్లో ఐదు సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి. కృష్ణమ్మ, ప్రతినిధి 2, సత్య, జితేందర్‌రెడ్డి, ఆరంభం మే 10న విడుదలకు సిద్ధమయ్యాయి.
సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. పోస్టర్‌పై కనిపించే కొరటాల పేరు.. ఈ చిత్రానికి అదనపు మైలేజీ తీసుకొచ్చింది. చేయని నేరానికి శిక్ష అనుభవించే ముగ్గురు మిత్రుల కథ ఇది. టీజర్, ట్రైలర్లో యాక్షన్ డోస్ ఎక్కువగా కనిపించింది. విజయవాడ నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడి పరిస్థితుల్ని దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడని చిత్రబృందం చెబుతోంది. కోర్ట్ రూమ్ డ్రామా సైతం ఆకట్టుకొనేలా తీర్చిదిద్దారని టాక్.
నారా రోహిత్ చిత్రాల్లో ప్రతినిధికి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో మరో సినిమా వస్తోంది. అదే ‘ప్రతినిధి 2’. జర్నలిస్ట్ మూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని ఈ కథతో ప్రతిబింబిస్తున్నామని చిత్రబృందం చెబుతోంది. దానికి తోడు ఇది ఎలక్షన్ సీజన్. కాబట్టి… ఈ సినిమాపై ఫోకస్ ఇంకాస్త పెరిగింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఏపీలోని రాజకీయాలకు, రాజకీయ నాయకుల తీరుకి అద్దం పట్టేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఉయ్యాల జంపాలతో ఆకట్టుకొన్న దర్శకుడు విరించి వర్మ. ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ అంటూ ఓ కథ చెప్పబోతున్నారు. ఈ సినిమా కూడా 10నే విడుదల కానుంది. ఇటీవల మలయాళ, తమిళ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ దక్కుతోంది. ‘ప్రేమలు’ మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అనువాద చిత్రం ‘సత్య’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ శుక్రవారమే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో పాటుగా ‘ఆరంభం’ అనే ఎమోషనల్ థ్రిల్లర్ కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఎలక్షన్ సీజన్, ఐపీఎల్ ఫీవర్‌ని కూడా లెక్క చేయకుండా గంపగుత్తగా సినిమాలు విడుదల అవ్వడం చిత్రసీమని కూడా షాక్‌కి గురి చేస్తోంది. మరి ఈ సాహసానికి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.