నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొదలైంది. ‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’ లాంటి మంచి సినిమాల్ని అందించారాయన. రోహిత్ ఓ కథ ఎంచుకొన్నాడంటే అందులో విషయం ఉండే ఉంటుందన్న నమ్మకం కలిగించాడు. అయితే ఆ తరవాత ట్రాక్ తప్పాడు. వరుస ఫ్లాపులు బాగా ఇబ్బంది పెట్టాయి. దాంతో కాస్త గ్యాప్ తీసుకోవాల్సివచ్చింది. ఈ విరామాన్ని కొంతమంది అలుసుగా తీసుకొన్నారు. రోహిత్ పై చాలా గాసిప్పులు సృష్టించారు. కేవలం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రోహిత్ కు సినిమాలు వచ్చాయని, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెప్పు పొందడానికే, నారా రోహిత్ తో నిర్మాతలు సినిమాలు తీశారని, ఓ విధంగా పార్టీ ఫండింగ్ తోనే నారా రోహిత్ హీరో అయ్యాడని.. రకరకాల గాసిప్పులు వినిపించాయి. దీనిపై తెలుగు 360కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో రోహిత్ స్పందించారు. తనపై వస్తున్న విమర్శలకు తగు రీతిన సమాధానం చెప్పారు.
”నా కెరీర్లో నేను చేసిన చెత్త సినిమాలన్నీ పెదనాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాను. మంచి సినిమాలు అంతకు ముందే చేసేశాను. ఫండింగ్తోనే సినిమాలు చేసేవాడ్నయితే కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వను. ఆ డబ్బేదో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లకు ఖర్చు పెట్టి, వాళ్లతోనే సినిమాలు చేసేవాడ్ని. మంచి సినిమాలు చేయడం లేదనే బ్రేక్ తీసుకొన్నా. మాట్లాడేవాళ్లు చాలారకాలుగా మాట్లాడుకొంటారు. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేద”ని సూటిగా సమాధానం చెప్పేశారు. రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ప్రతినిధి 2’ ఈనెల 10న విడుదల అవుతోంది. జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.