‘ప్రతినిధి 2’ విచిత్రమైన సమస్యలో పడింది. నిజానికి గత వారమే విడుదల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీసర్ సెలవులో ఊరు వెళ్లడం వల్ల, సెన్సార్ జరక్క, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్ ఆఫీసర్ రావడం, సినిమా చూడడం జరిగిపోయాయి. కానీ సెన్సార్ సర్టిఫికెట్ మాత్రం ఇవ్వలేదు. దాన్ని ‘హోల్డ్’లో పెట్టారు. నిజానికి సెన్సార్ బోర్డుకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, కట్స్ వేస్తారు. లేదంటే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తారు. కానీ ‘ప్రతినిధి 2’ విషయంలో ఇవి రెండూ జరగలేదు. ‘సినిమా అంతా ఓకే..’ అంటున్నారు తప్ప సర్టిఫికెట్ ఇవ్వడం లేదు.
నిర్మాతలేమో ఈనెల 10న ఈ సినిమాని విడుదల చేద్దామని ఎదురు చూస్తున్నారు. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించేశారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం వల్ల ప్రచారం చేసుకోవాలో, వద్దో తెలియడం లేదు. ఆ సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో, ఇవ్వరో, కొత్త అభ్యంతరాలేమైనా ప్రకటిస్తారో తేల్చుకోలేకపోతోంది. 10 న సినిమా విడుదల కావాలి. అలా జరగాలంటే రేపో, మాపో సెన్సార్ సర్టిఫికెట్ రావాలి. చివరి క్షణాల్లో సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా, చిత్రబృందం చేసేదేం ఉండదు. ఎందుకంటే ప్రచారానికి టైమ్ ఉండదు. సినిమా వస్తోందా, రాదా? అనే విషయం ప్రేక్షకులకూ అర్థం కాదు. సినిమా విడుదలైనా, ప్రచారం లేక, థియేటర్లు బోసిబోయే ప్రమాదం ఉంది. ఇటీవల ఏ సినిమాకీ లేని సెన్సార్ ఇబ్బంది, ఈ సినిమాకే ఎందుకంటూ నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుని ప్రశ్నించే సినిమా కదా, ఇలాంటి సినిమాల విషయాల్లో సెన్సార్ పద్ధతులు ఇలానే ఉంటాయేమో…?