కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణమని ఆస్ట్రాజెనెకా అంగీకరించిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు రెట్టింపు అయ్యాయి. ఈ వ్యాక్సిన్ వలన తాము సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నామని దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది ధర్మాసనం.
బ్రిటన్ దిగ్గజ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా , ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా తయారు చేసిన కోవిడ్ – 19 టీకా ఫార్ములాతో దేశీయంగా సీరం ఇన్ స్టిట్యూట్ కంపెనీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను తయారు చేసింది. దేశంలో ఈ వ్యాక్సిన్ విస్తృతంగా వినియోగించారు. గత కొంతకాలంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుండటంతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు తలెత్తాయి. విదేశాల్లో పలువురు కోర్టును కూడా ఆశ్రయించడంతో ఈ వ్యాక్సిన్ వలన దుష్ప్రభావాలు వాస్తవమేనని ఇటీవల ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఈ క్రమంలోనే ఇండియాలో కూడా కరోనా టీకా సైడ్ ఎఫెక్ట్స్, ఇతర ప్రమాదాల గురించి పరిశోధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొని మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించాలని పిటిషనర్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు వికలాంగులుగా కూడా మారారని, వారిని కూడా ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని దేశప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.